శుభలగ్నం, ఆహ్వానం, మావి చిగురు, యమలీల, నెంబర్ వన్… ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు అందించిన దర్శకుడు ఎస్వీ. కృష్ణారెడ్డి. క్లీన్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు ఆయన కేరాఫ్ అడ్రస్స్. ఆయన సినిమాల్లో పాత్రలు, సంభాషణలు, పాటలు కూడా ఆహ్లాదభరితంగా ఉంటాయి. హీరోగానూ కొన్ని సినిమాలు చేశారు. కానీ అచ్చి రాలేదు. కొన్నాళ్లు ఆయన దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. ఈమధ్య ఓ చిన్న సినిమా తీశారు, కానీ వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు మళ్లీ ఆయన మెగా ఫోన్ పట్టాడానికి రెడీ అయ్యారు.
‘వేద వ్యాస్’ పేరుతో ఓ కథ రాసుకొన్నారు కృష్ణారెడ్డి. స్క్రిప్టు దాదాపుగా పూర్తయ్యింది. చైనా, మలేషియా నుంచి కొంతమంది నటీనటుల్ని కూడా ఎంచుకొనే ప్రయత్నం మొదలెట్టార్ట. త్వరలోనే ఈ సినిమాని పట్టాలెక్కిస్తానని ప్రకటించారు కృష్ణారెడ్డి. ఈ చిత్రానికి ఆయనే సంగీతం అందిస్తారు. పాటలు కూడా రెడీ అయ్యాయి.
క్లీన్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు ఎప్పటికీ ఆదరణ ఉంటుంది. ఆ విషయంలో తిరుగు లేదు. కాకపోతే మారుతున్న ట్రెండ్ ని కృష్ణారెడ్డి పట్టుకోవాలి. ఈమధ్య ఆయన్నుంచి వచ్చిన రెండు సినిమాలూ బోల్తా కొట్టడానికి కారణం అదే. ఒకప్పుడు కృష్ణారెడ్డి పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేశారు. ఇప్పుడున్న స్టార్లు కృష్ణారెడ్డికి డేట్లు ఇవ్వకపోవొచ్చు. కానీ ‘యమలీల’లా ఓ కొత్త తరహా కథతో, కొత్తవాళ్లతో సినిమాలు తీసి, హిట్టు కొట్టగల సత్తా ఇంకా ఆయనకు ఉంది. ఇలాంటి దర్శకులు కమ్ బ్యాక్ అయితే బాగానే ఉంటుంది మరి.