ఈరోజుల్లో విడుదలకు ముందే సినిమాని సేఫ్ జోన్లో పెట్టుకోవడం చాలా అరుదైన విషయంగా మారిపోతోంది. పెద్ద పెద్ద సినిమాలకు సైతం ఓటీటీ డీల్స్ కుదరక… ఇబ్బంది పడుతున్నాయి. సినిమా చూస్తే తప్ప కొనం అని ఓటీటీలు భీష్మించుకొని కూర్చోవడంతో – నిర్మాతలకు తిప్పలు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ తమన్నా సినిమా ఓటీటీ డీల్ కుదుర్చుకొంది.
తమన్నా ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘ఓదెల 2’. సంపత్ నంది ఈ చిత్రానికి నిర్మాత. `ఓదెల రైల్వే స్టేషన్` ఓటీటీలో పెద్ద హిట్. ఆ క్రేజ్ తోనే ‘ఓదెల 2’ పట్టాలెక్కించారు. ఈసారి స్టార్ కాస్ట్ మారింది. స్టార్ టెక్నీషియన్లు వచ్చి చేరారు. క్వాలిటీ బాగా పెరిగింది. ఈమధ్య విడుదలైన టీజర్ మార్కెట్ వర్గాల్ని ఆకట్టుకొంది. దాంతో ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యింది. అమేజాన్ సంస్థ రూ.12 కోట్లకు ఓటీటీ హక్కుల్ని కొనుగోలు చేసింది. హిందీ డబ్బింగ్ రూ.6.25 కోట్లకు అమ్మేశారు. శాటిలైట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఈ సినిమాకు మొత్తం రూ.20 కోట్ల బడ్జెట్ అయ్యింది. అదంతా.. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చేసినట్టే. ఇక థియేటర్ నుంచి వచ్చిందంతా… లాభమే.
ఓదెల షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఏప్రిల్ లో విడుదల చేస్తారు. ఈనెలాఖరు నుంచి ప్రమోషన్లు మొదలెట్టాలని చిత్రబృందం భావిస్తోంది. తెలుగులో ఓ మంచి హిట్ కోసం తమన్నా ఆశగా ఎదురుచూస్తోంది. ‘ఓదెల 2’తో తన ప్రయత్నం ఫలించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.