పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలపై మీడియాలో ప్రతీ రోజూ కథనాలు వస్తున్నాయి. ఆయన అడవి ఆక్రమించాడని ..ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తాడని.. గనులను కొల్లగొట్టాడని.. ప్రజల డబ్బుతో ఇంటికి, పొలానికి రోడ్లేసుకున్నాడని ఇలా లెక్కలేనన్ని కథనాలు వస్తున్నాయి. తిరుపతిలో చెరువును కూడా కబ్జా చేశారని ఆధారాలతో సహా బయట పెట్టారు. మదనపల్లి ఫైళ్ల దహనం కేసు.. లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి వ్యవహారం.. ఇలా చెప్పుకుంటూ పోతే వారి చిట్టా చాంతాడంత ఉంది. అయినా ఎందుకు ఆయనపై చర్యలు తీసుకోవడం లేదు?
పెద్దిరెడ్డిపై ఎన్నో విచారణలు – ఏం చేశారు?
పెద్దిరెడ్డి అరాచకాలపై మీడియాలో వార్తలు వచ్చినప్పుడు విచారణకు ఆదేశిస్తారు. విచారణ జరుగుతుంది. అందులో స్కాం జరిగిందని తేల్చినట్లుగా మీడియాలో కథనాలు వస్తాయి. కానీ తర్వాత పట్టించుకునేవారు ఉండరు. అందుకే పెద్దిరెడ్డి ప్రభుత్వం కన్నా పవర్ ఫుల్ అని.. అధికారంలోకి టీడీపీ వచ్చినా ఆయనను ఏమీ చేయలేకపోతున్నారని అంటున్నారు. అందులో ఎంత నిజం ఉందో కానీ.. ఆయనపై వస్తున్న ఆరోపణల విషయంలో విచారణ జరుగుతున్నాయి కానీ.. చర్యల వరకూ వెళ్లకపోవడం అనేది కళ్ల ముందు ఉన్న నిజం.
చంద్రబాబు ప్రాణాలకు హాని తలపెట్టే కుట్రలు చేసిన పెద్దిరెడ్డి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ హయాంలో చేసిన ఘోరాలు చాలా ఉన్నాయి. చంద్రబాబుపై హత్యాయత్నాలు చేయించాడు. ఆంగళ్లులో చంద్రబాబుపై దాడి పక్కాగా పెద్దిరెడ్డి ప్లాన్. 70 ఏళ్ల వయసు ఉన్న చంద్రబాబుకు రాళ్లదాడిలో గాయం చేస్తే ఆయన ప్రాణానికి ముప్పు ఉంటుందని ఆయనకు తెలుసు. అందుకే ఆ పని చేశారు. ఇదంతా టీడీపీ పెద్దలకు తెలియదని కాదు కానీ ఎందుకు ఉపేక్షిస్తున్నారో ఇంకా అర్థం కాని విషయం.
వైసీపీలోనూ అనుమానాలే !
పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోకపోవడం వైసీపీకీ అనుమానంగానే ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీకి చెందిన అందరూ ఓడిపోయారు. పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు, ఆయన సోదరుడు మాత్రమే గెలిచారు. ఆయన ఇంచార్జ్ గా ఉన్న అనంతపురం జిల్లా మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. పెద్దిరెడ్డి కావాలనే టీడీపీకి మేలు చేశాడని వైసీపీ ఓడిపోవడానికి సాయం చేశాడని అందుకే ఉపేక్షిస్తున్నారని వైసీపీ నాయకత్వం నమ్ముతోంది. ఏది నిజమో కానీ.. పెద్దిరెడ్డి మాత్రం ఘోరాలు చేసి మరీ కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఉన్నారు.