తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టు సమాజంపై విరుచుకుపడ్డారు. ఇద్దరు చేసిన పని మొత్తం జర్నలిజం వ్యవస్థను అనుమానించి.. వారిని నియంత్రించే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అసలు జర్నలిస్టు అంటే ఎవరో తేలుస్తామని కూడా ఆగ్రహించారు. సీఎం రేవంత్ రెడ్డి అప్పటికి బాధితుడు కాబట్టి ఆయన ఆవేశంలో చెప్పారని అనుకోవచ్చు కానీ జర్నలిస్టు ఎవరో ఆయన నిర్వచించలేరు.. జర్నలిస్టుల విధుల్ని కూడా నియంత్రించలేరు. అలా చేయాలని అనుకోవడం ఆయన రాజకీయ జీవితానికి నష్టం చేస్తుంది.
జర్నలిస్టులు అంటే ఎవరు ?
జర్నలిస్టులు అంటే ఎవరు అని రేవంత్ ప్రశ్నించినప్పుడు.. గుర్తింపు పొందిన సంస్థల్లో పని చేసేవారే జర్నలిస్టులు అనే మాట చెప్పే ప్రయత్నం చేశారు. యూట్యూబర్లు జర్నలిస్టులు కాదని ఆయన ఉద్దేశం. నిజంగానే యూట్యూబర్లకు ఎవరూ జర్నలిస్టు అనే ట్యాగ్ ఇవ్వలేదు. వారికి వారే ఇచ్చుకున్నారు. ఎందుకంటే వారికి ఆ హక్కు ఉంది. నేను జర్నలిస్టును అని చెప్పుకునేందుకు ఎలాంటి అర్హత అవసరం లేదు. కానీ ఆ పేరుతో తప్పుడు పనులు చేస్తే అది రక్షణ కాదు.
ప్రతి వ్యవస్థలోనూ దారి తప్పేవారు ఉంటారు !
ఇద్దరు యూట్యూబర్లు ఓ పార్టీతో కలిసి తనను.. తన కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టిస్తున్నారన్నది రేవంత్ వాదన. ఈ విషయంలో ఆయన బాధితుడు. ఆయనను టార్గెట్ చేస్తూ.. రోడ్డున పోయే వారికి డబ్బులిచ్చి పార్టీ ఆఫీసుల్లోనే తిట్టించి.. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడం కుట్ర పూరితమే. ఆ యూట్యూబర్లు రాజకీయ పార్టీతో కలిసి పనిచేయడం తప్పు కాదు.. కానీ ముఖ్యమంత్రిపై అలాంటి మాటలు అనిపించడం .. వాటిని పోస్టు చేయడం తప్పే. అయితే వారిద్దరూ చేసిన పని మొత్తం జర్నలిజాన్ని అదే గాటన కట్టడం .. నియంత్రిస్తామని చెప్పడం సాధ్యం కాని విషయం. తప్పు చేసిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంది.
ప్రశ్నించే జర్నలిస్టులు వేరు.. తిట్టించేవారు వేరు !
ఇప్పుడు రాజకీయం మారిపోయింది. జర్నలిజాన్ని ఆ రాజకీయం అనే రకాలుగా వాడుకుంటోంది. తమకు అనుకూలంగా ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేయించుకోవడం కామన్ గా మారింది. తొండ ముదిరి ఉసరవెల్లి అయినట్లు ఈ వ్యతిరేక ప్రచారం కాస్తా అసహనంగా మారి తిట్ల దశకు.. చేరుకుంది. పుట్టుకల్ని ప్రశ్నించడం దగ్గర నుంచి చంపేస్తామని అనడం వరకూ వెళ్లింది. వీళ్లు తమకు తాము జర్నలిస్టులమని పేరు పెట్టుకున్నా వీరిని చట్టప్రకారం నియంత్రించాల్సిందే. వీరిని అడ్డం పెట్టుకుని వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని అందర్నీ నియంత్రించే ప్రయత్నం చేయడం మాత్రం ప్రజాస్వామ్యంలో నేతలకు ప్రమాదకరం.