సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించిన రేవంత్ గుర్తున్నాడా? రేవంత్ అంటే ఎవరూ గుర్తు పట్టరు. బుల్లి రాజు అనే అనాలి. ఆ సినిమాలో ఈ చిచ్చర పిడుగుని మర్చిపోలేం. బుడ్డోడే కానీ.. డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ లో ఎవర్నీ తీసిపోడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ పెద్ద హిట్ అయ్యింది. దాంతో పాటు బుల్లి రాజుకీ అవకాశాలు వరుస కడుతున్నాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ రిలీజ్ అయ్యాక ఇప్పటి వరకూ దాదాపు 20 ఆఫర్లు వచ్చాయట. కానీ.. బుల్లి రాజు దేనికీ కమిట్ అవ్వడం లేదు. ఒకవేళ అయినా, రోజుకు రూ.లక్ష పారితోషికం అడుగుతున్నాడట. నిర్మాతలు కూడా అడిగినంత ఇవ్వడానికి రెడీనే అంటున్నారు.
తాజాగా అనిల్ రావిపూడి మరో సినిమాలో ఈ బుల్లి రాజుని లాక్ చేసినట్టు తెలుస్తోంది. చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో కూడా బుల్లిరాజుకు ఓ మంచి పాత్ర పడిందని తెలుస్తోంది. కథానాయికగా మృణాల్ ఠాకూర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. అంజలి ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. అయితే చిత్రబృందం ఎలాంటి ప్రకటనా చేయడం లేదు. జూన్ లేదా జూలైలో చిత్రీకరణ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ ఓ ట్యూన్ రెడీ అయ్యిందని, ఈ పాటని రమణ గోగుల పాడబోతున్నారని తెలుస్తోంది.