కడప జిల్లా అనేది ఒకటి ఉండేదని చాలా మందికి తెలుసు. ఏంటి ఇప్పటి వరకూ కడప జిల్లా లేదా అని చాలా మంది ఆశ్చర్యపోతారు. నిజానికి ఇప్పుడు కడప అనే జిల్లా లేదు. వైఎస్ఆర్ అనే జిల్లా మాత్రమే ఉంది. జగన్మోహనరెడ్డి ఆంధ్రప్రదేశ్ పేరును వైఎస్ఆర్ ప్రదేశ్ అనే మార్చే క్రమంలో.. ముందుగా కడప జిల్లాకు వైఎస్ఆర్ జిల్లా అని పేరు పెట్టారు. కడప అనే పేరు తీసేశారు. కడప అనే పేరుకు చారిత్రక నేపధ్యం ఉన్నా పట్టించుకోలేదు.
జిల్లాల పునర్విభజన సమయంలో నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టినా ఆ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాగానే పెట్టారు. కానీ కడపకు వచ్చే సరికి కనీసం వైఎస్ఆర్ కడప అని కూడా కాకుండా.. వైఎస్ఆర్ జిల్లా అని మాత్రమే పెట్టారు. అధికారిక ఉత్తర్వులు వైఎస్ఆర్ జిల్లా పేరుతో వచ్చేవి. కానీ ప్రజలు మాత్రం కడప జిల్లాగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. కడప జిల్లా అనే మాట్లాడుకుంటున్నారు. కడపోళ్లం అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ వైఎస్ఆర్ జిల్లా వాళ్లం అని చెప్పుకునేవారు కాదు. కడప ప్రజల్లో ఓ ఎమోషన్ సృష్టించే పేరు.
కూటమి ప్రభుత్వం రాగానే.. వైఎస్ఆర్ జిల్లాను కడప జిల్లాగా అధికారికంగా మార్చాలన్న వినతులు వచ్చాయి. ప్రభుత్వం ఆ మేరకు పేరు మార్చేందుకు కేబినెట్ లో అనుమతి ఇచ్చింది. అయితే వైఎస్ఆర్ పేరును పూర్తిగా తీసేయలేదు. వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని నిర్ణయించుకుంది. వైఎస్ఆర్ పేరు తీసేస్తే అనవసర రాజకీయాలకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
అదే సమయంలో కృష్ణా జిల్లాలో తాటిగడప మున్సిపాలిటీకి కూడా జగన్ వైఎస్ఆర్ తాటిగడప అనే పేరు పెట్టారు. ఈ పేరు నుంచి వైఎస్ఆర్ తీసేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.