‘విశ్వంభర’ రిలీజ్ డేట్ విషయంలో మెగా ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ ఇంకా పోలేదు. ఏప్రిల్ లో ఈ సినిమా రావాలి. ఆ తరవాత మే 9 అన్నారు. ఈ రెండు డేట్లూ పోయినట్టే. వేసవిలో ఈ సినిమా రాదన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి ఎప్పుడొస్తుంది? ఆగస్టు 22 సందర్భంగా ఈ సినిమాని విడుదల చేస్తే బాగుంటుందన్నది యూవీ క్రియేషన్స్ ఆలోచన.
చిరంజీవి కూడా ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ గురించి ఏమాత్రం కంగారు పడడం లేదు. వీఎఫ్ఎక్స్ తో పెట్టుకొంటే పనులు ఓ పట్టాన తెవలవు అని ఆయనకు కూడా బాగా తెలుసు. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ అయిపోయిన తరవాత, వీఎఫ్ఎక్స్ చూసుకొని, అన్ని విధాల సంతృప్తి పడిన తరవాతే.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేద్దామని చిరు చెప్పారట. కాబట్టి… నిర్మాతలకూ కంగారు లేదు. కాకపోతే పెరిగిపోతున్న వడ్డీ రేట్లు భరించడం కొంత కష్టమే. హిందీ రైట్స్ రూపంలో యూవీకి మంచి రేటే వచ్చింది. ఇక శాటిలైట్ డీల్ క్లోజ్ చేయాల్సివుంది. ఇది వరకు విశ్వంభరని లైట్ తీసుకొన్న ఓటీటీ సంస్థలు ఇప్పుడు బేరాలకు దిగాయని, మంచి రేటు వస్తే, డీల్ క్లోజ్ చేస్తామని నిర్మాతలు చెబుతున్నారు. ఓ పాట మినహా షూటింగ్ కూడా పూర్తయినట్టే. అది ఐటెమ్ సాంగ్. ఆ పాట ఎవరితో చేయించాలి? అనే విషయంలో చిత్రబృందం మల్లగుల్లాలు పడుతోంది. ఎలాగూ… కావల్సినంత టైమ్ వుంది కదా. రిలీజ్కు ముందు ఈ పాట పూర్తి చేసినా చాలు.
త్రిష కథానాయికగా నటించిన ఈ చిత్రానికి వశిష్ట దర్శకుడు. కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ ఆల్బమ్ లో 6 పాటలు ఉంటాయని తెలుస్తోంది. అందులో ఆంజనేయుని గీతం కూడా వుందని, ఆ పాటని ఓ మంచి ముహూర్తం చూసుకొని విడుదల చేస్తారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.