హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మెల్లగా గాడిన పడుతున్నా అనుకున్న విధంగా ఊపు లేకపోవడానికి ప్రధాన కారణం ఓవర్ ప్రైసింగ్ గా కనిపిస్తోంది. ఇల్లు కొనేవాడికి కోట్లు అంటే చాలా తక్కువ అన్నట్లుగా బిల్డర్లు మార్చేస్తున్నారు. కేవలం ఐటీ ఉద్యోగుల్ని టార్గెట్ గా పెట్టుకుని హై రైజ్ అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. చివరికి వారికి కూడా అందనంత ధరకు చేరుస్తున్నారు. ఫలితంగా ప్రాజెక్టుల్లో సగం ఫ్లాట్లు కూడా అమ్ముడు పోని పరిస్థితి ఏర్పడుతోంది.
ఐటీ కారిడార్ కు..ఆరేడు కిలోమీటర్ల దూరంలో బహుళ అంతస్తుల భవనాలు ఎక్కువగా నిర్మితం అవుతున్నాయి. ఏ ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి వాకబు చేసినా వచ్చే సమాధానం.. కనీసం కోటిన్నర. అది బేస్ ప్రైస్. ఆ తర్వాత చాలా చార్జీలు ఉంటాయి. ఇంటీరియర్ తో కలుపుకుంటే అది మరో కోటి వరకూ అయినా ఆశ్చర్యం ఉండదు. ఓ అపార్టుమెంట్ ఫ్లాట్ రెండు కోట్లకు పైగా పెట్టాలంటే ఇంటి బయ్యర్ ఆర్థిక స్థోమత ఎంత ఉండాలి?. అలాంటివాళ్లు ఎంత మంది ఉన్నారు.. వారిలో ఎంత మంది ఇళ్ల కొనుగోలుకు రెడీగా ఉన్నారు ?. ఈ మార్కెట్ స్ట్రాటజీని పూర్తిగా రీసెర్చ్ చేయకుండా చేస్తున్న ప్రాజెక్టులతో ఎక్కువగా సమస్య వస్తోంది.
ఎంత ఆదాయం ఉన్న వ్యక్తి అయినా తను పెట్టే పెట్టుబడి, కాలానికి తగ్గ రిటర్న్స్ వస్తాయా రావా అని చూసుకుంటారు. తాను ఉండే ఇల్లు అయినా సరే తాను పెడుతున్న మనీ సేఫ్‌గా ఉండాలని .. దాని విలువ నిరంతరాయంగా పెరగాలని కోరుకుంటాడు కానీ.. వచ్చే పదేళ్ల తర్వాత ఉండే ధరల్ని ఇప్పుడే పెట్టాలని అనుకోరు. హైదరాబాద్ లో ఓ వర్గం రియల్టర్లు అంతా ఈ మాయలో పడిపోవడంతో .. అందరూ ఓ ట్రాప్ లో చిక్కుకున్నట్లయింది.
ఐటీ యేతర ఆదాయ వర్గాల వారు కూడా ఇళ్లు కొంటారని బిల్డర్లు గుర్తించలేకపోతున్నారు. వారి ఆదాయం తక్కువగా ఉండవచ్చు కానీ.. వారి మార్కెట్ పెద్దది. అది గుర్తించినప్పుడే హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు మళ్లీ ఊపు వచ్చే చాన్స్ ఉంది.