రియల్ ఎస్టేట్ మార్కెట్ కు రానున్న రోజుల్లో చాలా శుభసంకేతాలు కనిపిస్తున్నాయి. హోమ్ లోన్ వడ్డీ రేట్లు మరింతగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలం తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఇటీవల రేపో రేటును 25 బేసిక్ పాయింట్లు తగ్గించింది. ఆ ప్రతిఫలాన్ని బ్యాంకులు..ఖాతాదారులకు బదిలీ చేస్తున్నాయి. అయితే ఈ రిలీఫ్ రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
దేశంలో ద్రవ్యోల్బణం మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. గత అక్టోబర్ నుంచి ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది. గతేడాది డిసెంబర్ నెలలో ఇది 5.22 శాతంగా ఉండగా.. ఆ జనవరిలో 5.10 శాతంగా ఉంది. ఈ జనవరిలో 4.26 శాతం కాగా.. ఇప్పుడు ఫిబ్రవరిలో 3.61 శాతం అంటే చాలా తగ్గింది. ద్రవ్యోల్బణం ఇప్పుడు నియంత్రిత స్థాయిల్లోనే ఉన్నందున ఆర్బీఐ మరోసారి కీలక రెపో రేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయి.
ఫిబ్రవరి నెలలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి.. 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించింది. తర్వాత ఏప్రిల్, జూన్లో ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలు జరగనున్నాయి. ద్రవ్యోల్బణం ఇలాగే అదుపులో ఉంటే మరోసారి రెపో రేట్లు తగ్గే అవకాశాలు ఉంటాయి. అప్పుడు.. లోన్లపై బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను మరింత తగ్గిస్తాయి. అందుకే హోమ్ లోన్స్ ఆధారిత ఇళ్ల కొనుగోళ్లు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.