మంచు ఇంట్లో లుకలుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమధ్య ఈ కుటుంబం రోజూ వార్తల్లో ఉండేది. పరస్పరం కేసులు వేసుకొని, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు. ఇప్పుడు అంత రచ్చలేదు. కాకపోతే ఇంకా సర్దుకోలేదు. ఎన్ని పంచాయితీలు నడిపినా అన్నాదమ్ముల మధ్య గ్యాప్ తొలగిపోలేదు. ఇప్పటికి ఈ గొడవ నివురు గప్పిన నిప్పే. ఎప్పటికైనా మళ్లీ భగ్గుమనడం ఖాయం. అయితే ఇప్పుడు మరోసారి విష్ణు, మనోజ్ల ఫైట్ మొదలవ్వబోతోంది. అయితే ఈసారి బాక్సాఫీసు దగ్గర.
విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్.. ఇలా భారీతారాగణం ఉన్న సినిమా ఇది. దాదాపు రూ.150 కోట్లు ఈ సినిమా కోసం ఖర్చు పెట్టినట్టు విష్ణు చెబుతున్నారు. ఇదే రోజున.. మంచు మనోజ్ నటించిన ‘భైరవం’ విడుదల కానున్నదని ఇన్ సైడ్ వర్గాల టాక్. ‘భైరవం’ ఓ మల్టీస్టారర్ సినిమా. బెల్లంకొండ శ్రీనివాస్, మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రలు పోషించిన సినిమా ఇది. సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా ఇది. అయితే అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది ప్లాన్. మనోజ్ అయితే ‘కన్నప్ప’పై పోటీకి దిగితే బాగుంటుందని భావిస్తున్నాడట. నిర్మాతలు కూడా అందుకు రెడీగానే ఉన్నట్టు తెలుస్తోంది. మామూలు రోజుల్లో ఈ సినిమా విడుదల అయ్యేదానికంటే `కన్నప్ప`తో పాటు రిలీజ్ చేస్తే హైప్ మారుతుందని అనుకొంటున్నారు. ఈ విషయమై వారం, పది రోజుల్లో ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.