చిరంజీవితో సినిమా అనగానే యువ దర్శకులకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. వింటేజ్ చిరుని చూపించాలన్న తపన మొదలైపోతుంది. చిరు కోసం డ్యూయెట్లు, ఇంట్రడక్షన్లు రాసుకొంటారు. ఆ గోలలో అసలు టింజ్ మిస్సయిపోతుంటుంది. అయితే అనిల్ రావిపూడి మాత్రం కొత్త పంథాలో వెళ్తున్నట్టు తెలుస్తోంది.
చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా ఫిక్సయిన సంగతి తెలిసిందే. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తరవాత రావిపూడి నుంచి వస్తున్న సినిమా. పైగా చిరు హీరో. కాబట్టి అంచనాలు మామూలుగా ఉండవు. చిరు కామెడీ టైమింగ్ సూపర్బ్. ఈ విషయంలో తిరుగు లేదు. అనిల్ రావిపూడి బలమే కామెడీ. కాబట్టి… వీరిద్దరి నుంచి వినోదాత్మక చిత్రమే ఆశిస్తారు. అనిల్ రావిపూడి కూడా అలాంటి కథే రాసుకొన్నాడు. అన్ని రకాల కామెడీ దినుసుల్నీ ఈ సినిమా కోసం ప్రిపేర్ చేస్తున్నాడు.
చిరంజీవి పాత్రపై అనిల్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తోంది. ఈసారి చిరుకి డ్యూయెట్లు లేవు. లవ్ ట్రాక్ జోలికి వెళ్లడం లేదు. కంప్లీట్ ఫ్యామిలీమెన్‌గా చూపించబోతున్నార్ట రావిపూడి. ఈ కథని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేసినట్టు తెలుస్తోంది. చిరు వయసుకి తగినట్టుగానే పాత్రని రాసుకొన్నార్ట. ఇది నిజంగా ఆహ్వానించదగిన పరిణామమే.
ఈ వయసులోనూ చిరు లవ్ స్టోరీలు చెబుతానంటే.. ఫ్యాన్స్ కూడా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ విషయంలో చిరు మారడం మంచి పరిణామం. చిరు రాయలసీమ యాసలో మాట్లాడి చాలాకాలమైంది. ‘ఇంద్ర’ రాయలసీమ కథే. కానీ.. యాస పూర్తిస్థాయిలో వాడలేదు. ఈసారి మాత్రం రాయలసీమ యాస పూర్తిగా అవగాహన చేసుకోబోతున్నారని, ప్రతీ డైలాగ్ లోనూ అది కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో ఓ కథానాయికగా భూమికని ఎంచుకొన్నారని వార్తలొస్తున్నాయి. యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కు మరో పాత్ర దక్కిందని, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో హడావుడి చేసిన బుల్లిరాజు కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నాడని టాక్.