ప్రపంచం మొత్తాన్ని ఉత్కంఠకు గురి చేసిన సునీత విలియమ్స్ భూమిపైకి దిగే అంశం సక్సెస్ అయింది. సేఫ్ ఆమె భూమిపై కి చేరుకున్నారు. 8 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండేందుకు వెళ్లిన ఆమెతో పాటు బుచ్ విల్మోర్ అనే మరో అస్ట్రోనాట్ …తిరిగి తీసుకు వచ్చే వ్యోమనౌక లో సమస్యలు ఏర్పడటంతో అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది. భారత కాలమానం ప్రకారం మార్చి 19 తెల్లవారుజామున 3:27 గంటలకు స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ అనే వ్యోమనౌక లో వీరు సురక్షితంగా భూమి మీద అడుగుపెట్టారు. ఈ క్రూ డ్రాగన్ ఫ్లోరిడా తీర ప్రాంతంలోని సముద్ర జలాల్లో సేఫ్ గా ల్యాండ్ అయింది. తొమ్మిది నెలల పాటు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత స్పేస్ ఎక్స్ సాయంతో సురక్షితంగా తీసుకువచ్చారు. తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో ఉండటంతో ఆమెకు పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అమెరికాతో పాటు పలు అగ్రదేశాలు ఏర్పాటు చేసుకున్న కృత్రిమ ఉపగ్రహం. అది భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రోజుకు పదిహేను సార్ల వరకూ తిరుగుతూ ఉంటుంది. అక్కడ జీరో గ్రావిటీ ఉంటుంది. గాల్లో తేలుతూ ఉండాలి. అలాంటి కఠిన పరిస్థితుల్లో సునీతా విలియమ్స్ తో పాటు మరో వ్యోమగామి తొమ్మిది నెలలు గడిపారు. వారి ఆరోగ్యం క్షీణించే పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరికి నాసాకు స్పేస్ ఎక్స్ సాయం ఉపయోగపడింది. వాతావరణ పరిస్థితులు అన్నీ అనుకూలించడంతో ఎట్టకేలకు విజయవంతంగా తీసుకు రాగలిగారు.
సునీతా విలియమ్స్ మూలాలు భారత్ లోని గుజరాత్ లో ఉండటంతో మన దేశంలోనూ ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. గతంలో వ్యోమగామి కల్పనా చావ్లా అంతరిక్షం నుంచి భూమికి చేరుకునే సమయంలో వ్యోమనౌక పేలిపోవడంతో చనిపోయారు. ఈ ఘటనను గుర్తు చేసుకుని చాలా మంది సునీత విలియమ్స్ సేఫ్ గా ల్యాండ్ కావాలని పూజలు చేశారు. భూమికి వచ్చిన తర్వాత ఇండియాలో పర్యటించాలని భారత ప్రధాని లేఖ కూడా రాశారు.