ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి విషయంలో తెలుగుదేశం పార్టీ చాలా సార్లు ఘాటుగా స్పందిస్తూ వచ్చింది. తమపై ఏ విమర్శ చేసినా.. అసెంబ్లీలో జగన్ పార్టీ ఏ రచ్చ చేసినా.. తెలుగుదేశం స్పందన ఒకటే. జగన్ కు ప్రతిపక్ష నేతగాఉండే అర్హత లేదు, అతడు అవినీతి పరుడు.. మాపై అవినీతి ఆరోపణలు చేయకూడదు.. అని తెలుగుదేశం పార్టీ విరుచుకుపడుతూ వస్తోంది. అలాగే ప్రతిపక్ష నేతగా జగన్ తీరు కూడా తెలుగుదేశానికి కొంత వరకూ ప్లస్ అవుతూ వచ్చింది.
ఏం ప్రోగ్రామ్ చేసినా.. తనే ముందుండి చేస్తూ వచ్చాడు జగన్. దీక్షలు చేసినా.. ధర్నాలు చేసినా.. జగన్ మాత్రమే వాటిల్లో హైలెట్ అవుతూ వచ్చాడు. జగన్ కూడా అదే గొప్ప అనుకొంటూ వచ్చాడు. అయితే ప్రతి చోటా జగన్ మాత్రమే హైలెట్ అవుతూ రావడంతో కేవలం జగన్ పై దాడి చేసేస్తే.. జగన్ పై విమర్శలు చేసేస్తే.. చాలన్నట్టుగా తెలుగుదేశానికి పని సులభం అయ్యింది. అయితే ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ ను డిజైన్ చేసింది వైకాపా. గడపగడపకూ వైసీపీ అంటూ ప్రజల్లోకి వెళుతోంది. అది కూడా ఇది లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్. రాబోయే ఐదు నెలల పాటు ఈ ప్రోగ్రామ్ ను వైకాపా నిర్వహిస్తుందట.
అయితే జగన్ ఎన్ని ధర్నాలు చేసినా.. ప్రసంగాలు చేసినా.. ఎన్ని సభలు నిర్వహించుకున్నా, యాత్రలు నిర్వహించినా ఖాతరు చేయని తెలుగుదేశం మాత్రం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ తో అలర్ట్ అవుతోంది. ప్రభుత్వాలపై సహజంగా ప్రబలే వ్యతిరేకత ను ఎక్కడ వైసీపీ క్యాష్ చేసుకుంటుందో.. అనే ఆందోళన బయలు దేరుతోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించడం విశేషం. తాజాగా ఒక టెలీకాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షం విష ప్రచారాన్ని ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉందని.. ఆందోళన వ్యక్తం చేశాడు ముఖ్యమంత్రి. అలాగే వైకాపా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తిప్పి కొట్టడానికి కూడా కమిటీలు నియమించడం కూడా వైకాపా ప్రోగ్రామ్ ను తెలుగుదేశం లైట్ తీసుకోలేదనడానికి రుజువుగా కనిపిస్తోంది.