సినిమా తరవాత సినిమా అనే సూత్రాన్ని పెద్ద హీరోలంతా పక్కన పెట్టేశారు. మహేష్ బాబు మినహాయిస్తే, మిగిలిన హీరోలంతా చేతిలో రెండు మూడు కథలతో రెడీగా ఉన్నారు. రెండు సినిమాల మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాప్ రాకుండా ఉండాలన్నది వాళ్ల కండీషన్. ఓ సినిమా తరవాత ఎవరితో చేయాలి? ఎలాంటి కథ ఎంచుకోవాలన్న విషయంలో స్పష్టత చాలా అవసరం కూడానూ.
మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విషయంలో క్లియర్ కట్‌గా ఆలోచిస్తున్నారు. ‘విశ్వంభర’ తరవాత మెగా లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్నారు చిరు. జూన్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. సంక్రాంతికి విడుదల కానుంది. ఆ తరవాత… బాబితో ఓ సినిమా చేస్తారు. చిరు – బాబి కాంబోలో ‘వాల్తేరు వీరయ్య’ వచ్చిన సంగతి తెలిసిందే. చిరు కెరీర్లోనే అతి పెద్ద కమర్షియల్ హిట్ ఆ సినిమా. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ జట్టు కట్టబోతున్నారు. మరోవైపు ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా వుంది. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే శ్రీకాంత్ ఈలోగా నానితో ‘పారడైజ్’ చేయాలి. ఆ తరవాతే చిరు సినిమా ఉంటుంది.
వీళ్లతో పాటు వెంకీ అట్లూరి కూడా చిరంజీవికి ఓ కథ వినిపించారని సమాచారం అందుతోంది. బాబీ, శ్రీకాంత్ ఓదెల తరవాత పట్టాలెక్కే సినిమా ఇదే కావొచ్చు. ఇటీవలే `లక్కీ భాస్కర్`తో ఓ సూపర్ హిట్ కొట్టారు వెంకీ అట్లూరి. ఇప్పుడు సూర్యతో ఓ సినిమా చేయబోతున్నారని టాక్. అది అయ్యాక చిరుతో సినిమా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే మరో రెండేళ్ల పాటు చిరు సినిమాలేమిటి? ఎవరితో? అనే విషయాల్లో ఎలాంటి గందరగోళం లేనట్టే.