తెలంగాణ రాష్ట్రం వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. రూ.3,04,965 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించింది. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లుగా ఉంది. మూల వ్యయం రూ.36,504 కోట్లుగా అంచనా వేశారు. కీలకమైన పథకాలకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించే ప్రయత్నం చేశారు. రైతు భరోసా రూ.18 వేల కోట్లు , పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖకు రూ.31,605 కోట్లు, ఎస్సీ సంక్షేమమానికి రూ.40,232 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.17,169 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.11,405 కోట్లు కేటాయించారు.
పారిశ్రామిక, పట్టణ అభివృద్ధి రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. నిరంతర విద్యుత్ అందించే ప్రయత్నంలో భాగంగా విద్యుత్ శాఖకు రూ.21,221 కోట్లు కేటాయించారు. పురపాలక, పట్టణాభివృద్ధికి రూ.17,677 కోట్లు, ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టే నీటిపారుదల శాఖకు రూ.23,373 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు రూ.22,500 కోట్లు కేటాయించారు. ప్రతి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు చొప్పున 4.50 లక్షల ఇళ్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలోమ మంజూరు చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం రూ.11,600 కోట్లు కేటాయించారు.
ప్రభుత్వం హామీ ఇచ్చిన కొన్ని కీలక పథకాలకు నిధులు కేటాయించలేదు. అయితే వివిధ వర్గాల సంక్షేమానికి కేటాయించిన నిధుల్లోనే వాటికి ఖర్చుచేసే అవకాశం ఉంది. ఆదాయం తగ్గిపోతోందని అప్పుల భారం పెరుగుతోందని ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందుతున్న సమయంలో బడ్జెట్ లో ఆ ప్రభావం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఆదాయం పెంచుకునేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోకపోతే..బడ్జెట్ అంచనాలు గాడి తప్పే ప్రమాదం ఉంది.