వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ లేఖను శాసనమండలి చైర్మన్ కు ఇచ్చారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. పదవులకు రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీల సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటి వరకూ పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి పదవులకు వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు మర్రి రాజశేఖర్ వారితో జత కలిశారు.
మండలి చైర్మన్, వైస్ చైర్మన్లు ఇద్దరూ వైసీపీకి చెందిన వారే. సభ్యుల రాజీనామాలపై మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ ఆయన తీసుకోవడం లేదు. ఎన్నికలకు ముందు వైసీపీని ధిక్కరించిన వారిపై వరుసగా రాత్రికి రాత్రి అనర్హతా వేటు వేసిన చైర్మన్ మోషన్ రాజు ఇప్పుడు మాత్రం రాజీనామాలు చేసినా నిర్ణయాలు తీసుకోవడం లేదు. వైసీపీ హైకమాండ్ వారు మనసు మార్చుకుంటారని రాజీనామాలు ఆమోదించవద్దని మండిలి చైర్మన్ కు సూచించినట్లుగా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను ఆమోదించాలని పలుమార్లు మండలి చైర్మన్ ను కోరారు. అయినా ఆమోదించడం లేదు. ప్రస్తుతం ఉన్న బలం ప్రకారం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే ఆ సీటు టీడీపీకి వస్తుంది. మర్రి రాజశేఖర్ ను కాదని 2019లో విడదల రజనీకి టిక్కెట్ ఇచ్చారు. ఆమెను గెలిపిస్తే మర్రిని మంత్రిని చేస్తామన్నారు. కానీ అతి కష్టం మీద ఎమ్మెల్సీ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు విడదల రజనీని మళ్లీ చిలుకలూరిపేటకు తీసుకు రావడంతో ఆయన మనస్థాపానికి గురై అసలు పార్టీ కార్యక్రమాల్లో పట్టించుకోడడం లేదు. ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు. ఏ పార్టీలో చేరాలన్నది త్వరలో నిర్ణయించుకుంటానని చెబుతున్నారు.