ఉచితాలు రాను రాను ఏ దిశగా వెళ్తున్నాయో చెప్పే డిమాండ్ ఇది. ప్రతి నెలా పేదలకు రెండు బాటిళ్లఉచిత మద్యం ఇవాలని కర్ణాటక అసెంబ్లీలో జేడీఎస్ ఎమ్మెల్యే కృష్ణప్ప డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు రెండు వేలు ఇస్తున్నారు. ఉచిత విద్యుత్, ఉచిత బియ్యం లాంటివి ఇస్తున్నారు. కానీ వారు మద్యం కోసం ఎక్కువ ఖర్చు పెట్టుకుటున్నారని..అందుకే పేదలకు ప్రతి నెలా రెండు బాటిళ్ల ఉచిత మద్యం ఇవ్వాలన్నారు. కృష్ణప్ప డిమాండ్ విని మిగతా సభ్యులు అవాక్కయ్యారు.
ఆయన కామెడీగా అన్నారని అనుకున్నారు కానీ.. కృష్ణప్ప తన డిమాండ్ సీరియస్సేనని తేల్చేశారు. దీంతో అధికార కాంగ్రె్సపార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో మీ పార్టీ పోటీ చేసి గెలిచి..అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగే చేయండని చెప్పి కూర్చోబెట్టారు. కృష్ణప్ప డిమాండ్ తాగుబోతుల్ని ఆకట్టుకుంటుంది.సందేహం లేదు. రేషన్ బియ్యం ఇచ్చినట్లుగా ఉచిత మద్యం కూడా ఇస్తే చాలన్నట్లుగా కొంత మంది తీరు ఉంటుంది.
ఉచిత పథకాల లక్ష్యం ఓట్లు సంపాదించడమే. రేపు రాజకీయ నేతలు తమకు ఓట్లు రాలుస్తాయనుకుంటే ఉచిత మద్యం స్కీంను నిర్మోహమాటంగా ప్రకటిస్తారు. పేదలు ఖర్చు పెట్టుకోకుండా.. ఈ ఏర్పాటు చేస్తామని చెబుతారు. అయితే ఏ రాష్ట్రమైనా ప్రస్తుతం మద్యం ఆదాయం ద్వారానే సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. వాటిని కూడా ఉచితంగా పంచితే ఎలా అన్న ప్రశ్న పాలక స్థానంలో ఉన్న వారికి వస్తుంది.