మోడీ ప్రభుత్వం రూ.45,000 కోట్ల కుంభకోణాన్ని దాచిపెట్టి ఆరు టెలికాం సంస్థలని కాపాడేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలని భాజపా ఊహించిన విధంగానే తిప్పికొట్టింది.
రిలయన్స్, ఎయిర్ సెల్, ఐడియా తదితర ఆరు ప్రముఖ టెలికాం సంస్థలు ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులని తగ్గించుకొనేందుకు 2006 నుంచి 2010సం.ల మధ్యకాలంలో తమ ఆదాయాలని తక్కువచేసి, ఖర్చులని ఎక్కువ చేసి తప్పుడు లెక్కలు చూపాయని, దాని వలన ప్రభుత్వానికి రూ. 45,000 కోట్లు నష్టం వచ్చిందని కాగ్ నివేదికలో స్పష్టం చేసినప్పటికీ మోడీ ప్రభుత్వం ఆ విషయం బయటపెట్టకుండా దాచిపెట్టి ఆ టెలికాం సంస్థలని కాపాడే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
మొన్నటి వరకు టెలికాం మంత్రిగా వ్యవహరించి ప్రస్తుతం న్యాయశాఖా మంత్రిగా వ్యవహరిస్తున్న రవి శంకర్ కాంగ్రెస్ ఆరోపణలపై స్పందిస్తూ, “కాంగ్రెస్ పార్టీ రాజకీయ దుర్దేశ్యంతోనే మా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోంది. ఈ అవినీతి కూడా యూపియే ప్రభుత్వం హయంలోనే జరిగిందనే విషయం మరిచిపోయి మా ప్రభుత్వానికి కూడా దాని అవినీతి బురదని అంటించే ప్రయత్నిస్తోంది. కాగ్ సమర్పించిన నివేదికలో టెలికాం కంపెనీల ఆదాయ వ్యయాల గురించి తప్పుడు లెక్కలు చూపించడం గురించి పేర్కొంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లు ప్రభుత్వానికి రూ. 45,000 కోట్లు నష్టం వచ్చిందనే మాట వాస్తవం కాదు. టెలికాం సంస్థల నుంచి అంత మొత్తం వసూలు చేయడం సాధ్యం కాదు కూడా. ఎందుకంటే టెలికాం సంస్థల నుంచి లైసెన్స్ ఫీజ్, స్పెక్ట్రం చార్జీలు వసూలు చేయడానికి మాత్రమే ప్రభుత్వానికి అధికారం ఉంది. ఆ రెండు కలిపి మొత్తం రూ.5,200 కోట్లు మాత్రమే. దానిపై వడ్డీగా మరో రూ. 7,300 కోట్లు కలిపి మొత్తం రూ.12,500 కోట్లని టెలికాం సంస్థల నుంచి రాబట్టేందుకు మా ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ హయంలో జరిగిన ఈ అవినీతి మా హయంలో జరిగినట్లు కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఏదో విధంగా మా ప్రభుత్వంపై బురద జల్లి అప్రదిష్ట పాలుచేసేందుకు అది ఆ వాదిస్తోందని స్పష్టమవుతూనే ఉంది,” అని మంత్రి రవి శంకర్ జవాబు చెప్పారు.
మంత్రి రవి శంకర్ చెప్పిన మాటలని బట్టి చూసినా టెలికాం సంస్థలు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాయని స్పష్టం అవుతోంది. తమ ఆదాయ, వ్యయాలపై అవి తప్పుడు లెక్కలు చూపుతున్నందుకు వాటిపై కటిన చర్యలు తీసుకోకుండా వాటి నుండి లైసెన్స్ ఫీజ్, స్పెక్ట్రం చార్జీలు వసూలు చేయడానికి మాత్రమే ప్రభుత్వానికి అధికారం ఉందని మంత్రి చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. తమపై చర్యలు తీసుకోవలసిన మాత్రే ఆ విదంగా మాట్లాడుతుంటే ఇంక టెలికం సంస్థలు మాత్రం ఎందుకు భయపడతాయి?
మన రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఈవిదంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలాగ మాట్లాడుతుంటాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన అవి తమ అండగా నిలబడతాయనే వాటి నమ్మకాన్ని మన రాజకీయ పార్టీలు ఎన్నడూ వమ్ము చేయలేదు. అందుకే టెలికాం సంస్థలు అంత ధైర్యం చేయగలుగుతున్నాయని చెప్పక తప్పదు. ఇటువంటి ఆర్ధిక అవకతవకలకి ఒక్క టెలికాం కంపెనీలు మాత్రమే పాల్పడుతున్నాయని సరిబెట్టుకోవడానికి లేదు. దేశంలో వివిధ వ్యాపార, పారిశ్రామిక సంస్థలన్నీ యధాశక్తిగా అవకతవకలకి పాల్పడుతూనే ఉంటాయని అందరికీ తెలుసు. కానీ దొరికేతేనే దొంగలు అన్నట్లు టెలికాం సంస్థలు, విజయ్ మాల్యా వంటి వాళ్ళు అప్పుడప్పుడు దొరికిపోతుంటారు. అయినప్పటికీ వారికి కూడా ఎవరి వలన ప్రమాదం ఉండదని పదేపదే నిరూపితం అవుతూనే ఉంది. విజయ్ మాల్యా వంటి వారు గుట్టు చప్పుడు కాకుండా దేశం విడిచి పారిపోయి తప్పించుకొంటే, దేశంలోని ఆర్ధిక నేరస్తులు సుదీర్గమైన న్యాయపోరాటం చేస్తూ శిక్ష పడకుండా తప్పించుకొంటారు. ఈలోగా ప్రభుత్వాలు మారిపోతుంటాయి కనుక వారి నేరాలు కూడా అటకెక్కిపోతుంటాయి. ఉన్నతస్థాయిలో జరుగుతున్న ఈ ఆర్దికనేరాలని ప్రభుత్వలు కట్టడి చేయలేకపోవడం చేత ఆ భారం దేశంలో సామాన్యప్రజలందరూ మోయవలసి వస్తోంది. కంచే చేను మేస్తే ఎవరేమి చేయగలరు?