కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి తెరాసలో చేరితే కాంగ్రెస్ పార్టీ ఆయనని విమర్శిస్తే అది సహజమే కానీ భాజపా నేతలు ఆయనపై విరుచుకుపడటం విచిత్రంగా ఉంది. ఇటీవల రాష్ట్ర భాజపా మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ప్రస్తుత అధ్యక్షుడు డా.లక్ష్మణ్ తదితరులు నల్గొండ జిల్లా పర్యటనకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. దానితోబాటు లోక్ సభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డిపై కూడా విమర్శలు గుప్పించారు. ఆయన ఎంపిగా ఉంటూ తన స్వార్ధం తాను చూసుకొన్నారే తప్ప జిల్లాకి ఏమి చేయలేదని కిషన్ రెడ్డి విమర్శించారు.
దానికి ఆయన కూడా చాలా ఘాటుగానే జవాబిచ్చారు. “జిల్లా అభివృద్ధి కోసం నేను కృషి చేసినంతగా మరెవరూ కృషి చేయలేదని చెప్పగలను. ఎంపి లాడ్ నిధులు కేటాయించి జిల్లాలో అనేక అభివృద్ధి పనులు చేయించాను. ఎంపిగా ఉన్నప్పటికీ జిల్లా ప్రజలకి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను. నేను అధికార పార్టీకే చెందినవాడినయినప్పటికీ తెలంగాణా కోసం పార్లమెంటులో ధైర్యంగా మాట్లాడేవాడిని. అందుకు 15సార్లు సభ నుంచి సప్స్పెండ్ అయ్యాను. జిల్లా కోసం, రాష్ట్రం కోసం ఆలోచిస్తాను గాబట్టే తెరాసలో చేరాను. పదవులు, అధికారం కోసం కాదు. నేను కేవలం ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, పార్టీల గురించి ఆలోచిస్తాను తప్ప మిగిలిన సమయంలో జిల్లా, రాష్ట్ర భివృద్ధి కోసమే పాటుపడుతుంటాను. అందుకే జిల్లా ప్రజలు నన్ను ఆదరిస్తుంటారు. ఈ రెండేళ్ళలో మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి చేసింది? జిల్లాకి ఏమి చేసిందో వారు చెప్పగలరా? ఏమీ లేదు. అందుకే భాజపా అభ్యర్ధులు ఏ ఎన్నికలలోను గెలువలేకపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడూ విదేశాలలోనే తిరుగుతుంటారు తప్ప ఈ రెండున్నరేళ్ళలో ఏనాడైనా తెలంగాణాలో కలుమోపారా? రాష్ట్రం కోసం, జిల్లా కోసం ప్రత్యేకంగా ఏమైనా చేశారా?” అని ప్రశ్నించారు.
హైదరాబాద్ పేరు చెప్పగానే హైటెక్ సిటీ, కోల్ కత పేరు చెప్పగానే హౌరా బ్రిడ్జి ఏవిదంగా కళ్ళముందు కదలాడుతాయో, నల్గొండ జిల్లా పేరు చెప్పగానే ఫ్లోరోసిస్ వ్యాధి బారినపడి దయనీయమైన జీవితాలు గడుపుతున్న నిరుపేద ప్రజలే గుర్తుకువస్తారు. అది తమకి అవమానకరమని ప్రజాప్రతినిధులు భావించలేదు అందుకే ఆ సమస్యని పట్టించుకోలేదు. నిన్నటి మొన్నటివరకు జిల్లా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఏదో కొద్దిపాటి అభివృద్ధి జరిగినా అది కాలక్రమంలో సహజంగా జరిగిందే తప్ప ఎవరూ గట్టిగా పూనుకొని చేయడం వలన జరిగింది కాదు. ఇక రోడ్లు, కాలువలు, మంచినీళ్ళు, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పన అనేది బాధ్యతే తప్ప అది గొప్పదనం కాదు. జిల్లాలో సమస్యలని పరిష్కరించి, విద్యా, వైద్య, ఉపాధి అవకాశాలని మెరుగుపరిచి ప్రజల జీవన ప్రమాణాలు పెంచగలిగితే దానినే అభివృద్ధి అని చెప్పుకోవచ్చు. కానీ నేటికీ జిల్లాలో అనేక మండలాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాయి. కనుక నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకొంటూ కాలక్షేపం చేయడం కంటే ఆ సమస్యలని పరిష్కరించడంపై దృష్టి పెడితే బాగుంటుంది కదా!