మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత ఆయన రాజకీయ వారసత్వం కోసం చాలా రోజుల వరకు కాంగ్రెస్, వైకాపాలు కీచులాడుకొన్నాయి. ఆ తరువాత సిబిఐ కేసులు జోరందుకోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆయన్ని వైకాపాకే విడిచిపెట్టేసింది. కానీ నేటికీ ఆయన వారసత్వం కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందా లేక వైకాపాకా అనే ధర్మ సందేహం కలుగుతూనే ఉంది.
స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి 67వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టి.పార్ధసారధి రెడ్డి నేతృత్వంలో చిత్తూరు జిల్లాలో పలమనేరు నియోజకవర్గంలో జనగల అగ్రహారంలో నిన్న జయంతి వేడుకలు నిర్వహించారు. ఆ సందర్భంగా పార్ధసారధి రెడ్డి మాట్లాడుతూ, “స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి నూటికి నూరు శాతం కాంగ్రెస్ వాది. చివరి నిమిషం వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కనుక ఆయన రాజకీయ వారసత్వం కాంగ్రెస్ పార్టీకే చెందుటుంది. జగన్మోహన్ రెడ్డి ఆయన కొడుకు అయినంత మాత్రాన్న ఆయన రాజకీయ వారసుడు అయిపోరు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా జగన్ ఆయన జన్మ దినవేడుకల్ని జరుపుకోవచ్చు కానీ వైకాపా అధ్యక్షుడుగా కాదు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలకి భిన్నంగా జగన్ వైకాపాని ఏర్పాటు చేసుకొన్నప్పుడే ఆ హక్కుని కోల్పోయారు. రాజకీయ మైలేజ్ కోసం వైకాపా నేతలు ఆయన పేరు చెప్పుకొంటున్నారు. కానీ వారికి ఆయనపై ఎటువంటి హక్కు లేదు. వారు ఆయనకి వారెవరూ రాజకీయ వారసులు కానేకారు,” అని అన్నారు.
స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పైకి ఎదిగారు. అలాగే పార్టీ కూడా ఆయన కారణంగానే సమైక్య రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి రాగలిగింది. కనుక ఆయన వలన పార్టీకి, పార్టీ వలన ఆయన లాభం పొందారు. అయితే ఆయన చనిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఆయనని పట్టించుకోలేదనే చెప్పక తప్పదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని ఒక కాపు కాసిన మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహరావునే విస్మరించిన కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డిని విస్మరించితే ఆశ్చర్యం లేదు. అది విస్మరించింది గాబట్టే ఆయన రాజకీయ వారసత్వాన్ని వైకాపా క్లెయిం చేసుకోగలిగింది.
జగన్ ఆయన పేరిట ఓదార్పు యాత్రలు చేసి, ఆయన హయంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించి ఎన్నికలలో ప్రచారం చేసుకొని లబ్దిపొందిన తరువాత కానీ రాజశేఖర్ రెడ్డిని వైకాపాకి విడిచిపెట్టి ఎంత పొరపాటు చేసిందో కాంగ్రెస్ పార్టీ గ్రహించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఆ కీర్తి ప్రతిష్టలు మిగలక పోయినా ఆయన హయంలో జరిగిన అవినీతి, క్విడ్ ప్రో కేసుల మచ్చలు మాత్రం మిగిలిపోయాయి. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా నేటికీ మూల్యం చెల్లిస్తూనే ఉన్నారు. కానీ అందుకు పరిహారంగా అన్నట్లుగా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని చాలా రాజకీయ మైలేజీ, ప్రయోజనాలు పొందగలుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిలోని ఆ మంచి చెడులని స్వీకరించడానికి సిద్దపడి ఉండి ఉంటే దానికీ ఆ ఫలాలు దక్కేవేమో?