తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూటమిగా పోటీ చేయడం వల్లనే విజయం సాధించారని కానీ తాను మాత్రం ఒంటరిగానే అధికారంలోకి వస్తానని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రామగుండం పార్టీ నేతలతో చెప్పారు. ఇతర విషయాల సంగతి పక్కన పెడితే ఆయన ఎందుకు పదే పదే చంద్రబాబుతో పోల్చుకుంటున్నారన్నది బీఆర్ఎస్ నేతలకూ అర్థం కాని విషయం. చంద్రబాబు తెలంగాణలో రాజకీయాలు చేయడం లేదు. కనీసం తన పార్టీ అధ్యక్షుడ్ని కూడా నియమించలేదు. మరి ఎందుకు కేసీఆర్ చంద్రబాబు జపం చేస్తున్నారు ?
తెలంగాణలోనూ ఎన్డీఏ యాక్టివ్ అవుతుందన్న ఆందోళన
తెలంగాణలోనూ ఎన్డీఏ యాక్టివ్ అవుతుందన్న ఆందోళన కేసీఆర్‌లో కనిపిస్తుందన్నది రాజకీయవర్గాల అంచనా. ఎన్నికల్లో గెలుపు అనేది గెలుపే.. అది కూటమిగా గెలిచారా..ఒంటరిగా గెలిచారా అన్నది చర్చించుకోవడానికి పనికొస్తుంది. ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయి కూటమిగా ఉండే గెలిచేవాళ్లమని ఎంత తెలివి తక్కువ తనమో.. వాళ్లు కూటమి కాబట్టే గెలిచారని ఓడిన వాళ్లు ఫీల్ కావడం కూడా అంత కంటె ఎక్కువ చేతకానితనం అవుతుంది. ఏపీలో విషయంలో కేసీఆర్ కూటమి వల్లనే గెలిచారనుకుంటే అదే కూటమి తెలంగాణలో వస్తే పరిస్థితి ఏమిటన్నది ఆయన ఆందోళన అనుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణలో ఎన్డీఏ కూటమి ఏర్పడుతుందన్న ప్రచారం జరుగుతోంది.
బీజేపీ కూటమిగా ఏర్పడితే బీఆర్ఎస్కు గడ్డు పరిస్థితి
తెలంగాణ ఉద్యమం ఒకప్పుడు బీఆర్ఎస్కు రక్షణ కవచంగా ఉండేది. కుల, మత ప్రాంతాలకు అతీతంగా బీఆర్ఎస్కు మద్దతుగా ఉండేది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఓటర్ల ప్రాధాన్యతలు మారిపోయాయి. ఫలితంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ తగ్గిపోతూ వచ్చింది. చివరికి పార్లమెంట్ ఎన్నికల నాటికి అది డిపాజిట్లు కోల్పోయే పరిస్థితికి వచ్చింది. బలంగా ఉన్నారనుకున్న ఉత్తర తెలంగాణలో దారుణంగా పరిస్థితి ఉంది. మరీ అంత బలంగా లేని దక్షిణ తెలంగాణలో పరిస్థితి ఇంకా ఘోరంగా మారుతోంది. ఇలాంటి సమయంలో ఎన్డీఏ కూటమిగా ఏర్పడితే.. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలోనూ మరింతగా బలపడే అవకాశం ఉంది. అదే కేసీఆర్ లో ఆందోళన
ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్స్ రావు – కూటమి అయితేనే !
కేసీఆర్‌కు మొండితనం ఉంటుంది కానీ ఆయనకు రాజకీయ సమీకరణాలు బాగా తెలుసు. ఒంటరిగా గెలుస్తాం అని చెప్పడం.. చంద్రబాబు కూటమిగా గెలిచాడని చెప్పడం వెనుక భిన్నమైన రాజకీయ వ్యూహం ఉంది.వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఓ కూటమిలో చేరకపోతే మనుగడ ఉండదన్న సంకేతాలను ఆయన పంపారని అనుకోవచ్చు. బీజేపీ కేసీఆర్ తో జతకట్టడానికి సిద్ధంగా లేదన్న ప్రచారం మధ్య..ఆయనకు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ కాంగ్రెస్. ఈ దిశగా చెన్నై సమావేశం ద్వారా ఓ అడుగు ముందుకేశారని అనుకోవచ్చు. ఆ సమావేశం జరుగుతున్నప్పుడు ఈ కామెంట్స్ చేశారు.