గోపీచంద్ కథానాయకుడిగా ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలెడతారు. ఈ చిత్రంలో కథానాయికగా రితికా నాయక్ని ఎంచుకొన్నారు. నిన్ననే గోపీచంద్ – రితికల మధ్య ఫొటో షూట్ జరిగింది. అధికారిక ప్రకటన రావాల్సివుంది.
‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాతో ఆకట్టుకొంది రితిక. అయితే ఆ తరవాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. మొన్ననే వరుణ్ తేజ్ సినిమా ‘కొరియన్ కనకరాజు’లో కథానాయికగా ఎంపికైంది. ఆ సినిమా ఇటీవలే పట్టాలెక్కింది. ఇంతలోనే గోపీచంద్ సినిమాలో ఛాన్స్ అందుకొంది.
చారిత్రక నేపథ్యం ఉన్న కథ ఇది. 7వ శతాబ్దంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. విజువల్స్, మేకింగ్ విషయంలో సంకల్ప్ ప్రత్యేక దృష్టిని పెడుతున్నారు. గోపీచంద్ 33వ సినిమా ఇది. తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడవుతాయి.