వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగాను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. వంశీ తరపున కీలక పనులు, వ్యవహారాలు చక్కపెట్టేది ఓలుపల్లి రంగానే. ఇంత కాలం ఆయన పరారీలో ఉన్నారు. రాజమండ్రిలో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని సీఐడీకి అప్పగించారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో రంగానే ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన కోసం వెదుకుతున్నారు.
ఓలుపల్లి మోహన్ రంగా అనబడే ఈయన గన్నవరంలో జరిగిన అనేక అక్రమాల్లో కీలక నిందితుడు. టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆయన వీడియోలు కూడా ఉన్నాయి. అలాగే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులోనూ ఏ5గా ఉన్నారు. కొంత కాలంగా అతని కోసం వెదుకుతున్న పోలీసులకు ఇతర రాష్ట్రాలకు పారిపోకుండా రాజమండ్రిలో ఉండి.. దొరికిపోయాడు.
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆ పిటిషన్ పై తీర్పు రావాల్సి ఉంది. ఇప్పటికే ముందస్తు బెయిల్ తిరస్కరించారు. మరో వైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనూ బెయిల్ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న కేసుల ప్రకారం చూస్తే ఆయన ఇప్పుడల్లా బయటకు రావడం కష్టమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆయన ఆయన చేసిన అరాచకాలపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా నియమించారు.