కడప జడ్పీ చైర్మన్ గా వైసీపీకి చెందిన బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పలు చోట్ల ఖాళీగా ఉన్న పదవుల కోసం ఉపఎన్నికలు నిర్వహించింది. ఈ క్రమంలో గతంలో వైసీపీ జడ్పీచైర్మన్ చైర్మన్ గా ఉండి రాజంపేటలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమయింది.
టీడీపీ అధికారంలోకి రావడంతో జడ్పీ చైర్మన్ పీఠం కోసం ప్రయత్నిస్తుందన్న ప్రచారం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీకి చాలా పరిమితంగా బలం ఉంది. గతంలో ఎన్నికల్లో ఒక్కరే జడ్పీటీసీగా గెలిచారు. 38 చోట్ల వైసీపీ జడ్పీటీసీలను ఏకగ్రీవం చేసుకుంది. టీడీపీలో కొంత మంది జడ్పీటీసీలు చేరినప్పటికీ మొత్తం జడ్పీని కైవసం చేసుకోవడానికి సరిపోవని.. పదవీ కాలం అయిపోయే దశలో మిగిలిన వారిని ఆకర్షించాల్సిన అవసరం లేదని అనుకున్నారు. దాంతో పోటీకి దూరంగా ఉన్నారు.
టీడీపీ పోటీ చేస్తుందన్న ఉద్దేశంతో జడ్పీచైర్మన్ అభ్యర్థిగా చాలా కాలం కిందటే ప్రకటించిన రామగోవిందరెడ్డి జడ్పీటీసీల అవసరాలు తీర్చేందుకు భారీగా ఖర్చు పెట్టుకున్నారు. వారిని క్యాంపులకు కూడా తీసుకెళ్లారు. వైఎస్ జగన్ రెండు సార్లు జడ్పీటీసీలతో సమావేశమైన పార్టీని ముంచవద్దని కోరారు. మొత్తంగా సింపుల్ గా గెలవాల్సిన జడ్పీచైర్మన్ పీఠం .. చాలా ఖర్చు చేసుకుని నిలబెట్టుకోవాల్సి వచ్చింది.