Veera Dheera Soora Movie Review
తెలుగు360 రేటింగ్: 2.75/5
ఒక్కరాత్రిలో జరిగిపోయే కథ అనగానే కార్తి ‘ఖైదీ’ సినిమా గుర్తుకు వస్తుంది. ఇప్పుడు విక్రమ్ కూడా సింగిల్ నైట్ కథతో వచ్చాడు. అదే.. వీర ధీర శూర. ఎస్ యూ అరుణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఎస్జే సూర్య, తుషారా విజయన్, సూరజ్ వెంజరమూడు కీలక పాత్రలు పోషించారు. మార్చి 27 విడుదల అనుకున్నారు కానీ కొన్ని లీగల్ సమస్యలు వలన ఉదయం షోలు క్యాన్సిల్ అయ్యాయి. అయితే సాయంత్రం నుంచి షోలు పడటంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది. రెండు భాగాల ఈ కథని తొలుత రెండో భాగం విడుదల చేయడం మరో విశేషం. అసలు ఇలా చేయడానికి కారణం ఏమిటి? రిలీజ్ లోనే ఇంత వెరైటీ వున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది?
రవి (పృథ్వీ రాజ్) కొడుకు కన్నా (సూరజ్ వెంజరమూడు). ఈ ఇద్దరిని ఎన్ కౌంటర్ చేయాలని ప్లాన్ చేస్తాడు ఎస్పీ అరుణగిరి (ఎస్.జె. సూర్య). అరుణగిరిని లేపేయడానికి కాళి (విక్రమ్)ని రంగంలో దించుతాడు రవి. తర్వాత ఏం జరిగిందనేది మిగతా సినిమా. కథ చదివాక మిగిలిన పాత్రలుకు లేవా, కథ ఇంత సింపుల్ గా ఉందేంటి? అనే సందేహం రావచ్చు. అలా సందేహం రావడం కూడా కరెక్టే. ఎందుకంటే డైరెక్టర్ అరుణ్ కుమార్ ఈ కథని ఎత్తుకున్న విధానమే కాస్త వెరైటీగా వుంటుంది.
ఈ సినిమా తొలి 5 నిమిషాలూ మిస్ అవ్వకుండా చూడండని రిక్వెస్ట్ చేశాడు విక్రమ్. ఆ రిక్వెస్ట్ లో అర్ధం వుంది. తలా తోకా లేకుండా మొదలుపెట్టిన ఈ కథలో ఫస్ట్ ఫైవ్ మినిట్స్ మిస్ అయితే కనుక ఒక్క రోజు కూడా క్లాస్ కి రాకుండా ఫైనల్ ఇయర్ పరీక్ష రాసే విద్యార్థిలా తయారౌతుంది పరిస్థితి.
అసలు పాయింట్ లోకి వస్తే కథని అవుట్ ఫోకస్ చేసి.. పెర్ఫార్మెన్స్, టెక్నికల్ బ్రిలియన్స్ కి పెద్దపీట వేస్తూ తీసిన యాక్షన్ సినిమా ఇది. ఒక్క రాత్రిలో జరిగే కథ అంటే ఖైదీ గుర్తుకు వస్తుందేమో కానీ.. ఈ సినిమాకి స్ఫూర్తి మాత్రం హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ డేవిడ్ ఫించర్, మార్టిన్ స్కోర్సెస్ సినియాలనే చెప్పాలి. తెరపై చూస్తున్న సీన్ లైవ్ లో జరుగుతుందేమో అన్నంత ఫీల్ కలిగించి ప్రేక్షకుడిని లీనం చేయడంలో దర్శకుడు చాలా చోట్ల మెప్పిస్తాడు.
ఈ సినిమా గురించి చెప్పాలంటే కథగా కాకుండా ఫిల్మ్ మేకింగ్ స్టయిల్ కోసం చాలా విశేషాలు చెప్పొచ్చు. ముఖ్యంగా తేని ఈశ్వర్ కెమెరాపనితనం ప్రత్యేక ఆకర్షణగాట నిలుస్తుంది. ఈ సినిమాలో కెమెరా ఒక క్యారెక్టర్ లా ప్లే అవుతుంది. స్లో మోషన్, ఎలివేషన్స్ తో సంబంధం లేకుండా కెమెరా రియల్ టైం లో కదులుతూ వుంటుంది. నిజానికి సినిమాలో కథ ప్రేక్షకుడిని ఎంగేజింగ్ గా వుంచుతుంది. కానీ ఇందులో మాత్రం కెమెరా ఆ పని చేస్తుంది. పది నిముషాలు పాటు సాగే సింగిల్ షాట్ ఓ హైలెట్. యాక్షన్ సీన్స్ అన్నీ స్టన్నింగ్ గా చిత్రీకరించారు.
ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని తొలి సీన్ లోనే దర్శకుడు ప్రజెంట్ చేసి తీరు ఆకట్టుకుంటుంది. రాత్రిపూట ఓ మహిళా రవి, కన్నాల ఇంటి దగ్గరికి వచ్చి తన భర్తని ఏం చేశారని నిలదీస్తుంది. ఆ క్షణంలో కన్నా (సూరజ్ వెంజరమూడు) వరండాని శుభ్రం చేస్తుంటాడు. సూరజ్ వెంజరమూడు లాంటి నటుడు వుంటే ఖచ్చితంగా ఓ క్లోజప్ పడాలి. కానీ డైరెక్టర్ టేక్ వేరు. దేన్నీ కూడా ఆబ్జెక్టిఫై చేయకుండా ఆ మొత్తం సీన్ ని ప్రేక్షకుడు చూస్తున్న ఓ వీధి గొడవలానే చూపించాడు. ఈ ఒక్క సీన్ చూడబోయే సినిమా ఎలా వుండబోతుందో ఓ క్లారిటీ ఇచ్చేస్తుంది.
కథా గమనం చూసుకుంటే.. హాఫ్ వే లో కథ మొదలౌతుంది. ఎస్జే సూర్య ఎన్ కౌంటర్ ప్లాన్, దాని నుంచి తప్పించుకోవడానికి రవి, కన్నాల స్కెచ్, ఈ ఇద్దరి మధ్యలోకి వచ్చిన కాళి.. మందుపాతర పెట్టాలనుకునే ప్లాను.. ఇవన్నీ ఆసక్తిగానే వుంటాయి. కాళి పాత్రని ఎలాంటి పరిచయం లేకుండా తెరపైకి తీసుకురావడం కూడా ఒక విధంగా ఆసక్తిని పెంచింది. ”నేను అన్నీ మర్చిపోయాను. నా కుటుంబానికి ఏదైనా జరిగితే మాత్రం మళ్ళీ అన్నీ గుర్తుకు వస్తాయి’అని కాళి చెప్పిన డైలాగ్ అతని గతంపై మరింత క్యూరియాసిటీని కలిగిస్తుంది. సెకండ్ హాఫ్ లో అతని గతం రివిల్ అవుతుంది కానీ అది కూడా కొంతమేరకే రివిల్ చేశారు. దిలీప్ అనే పాత్ర చుట్టూ పెద్ద డ్రామానే నడిచింది. క్యారెక్టర్ ని రిజిస్టర్ చేయకుండా ఆ సీక్వెన్స్ మొత్తాన్ని తీశారు. బహుశా ఫస్ట్ పార్ట్ లో అది కీలకం కావచ్చు. పోలీస్ స్టేషన్ లో కాళి పాత్ర చేసి గన్ ఫైర్ ఈ సినిమాలో ఓ విజల్ వర్తీ మూమెంట్.
సినిమాలో లోపాలు లేకపోలేదు. మంచి కథ డ్రామా ఎమోషన్స్ వుండాలని అని కోరుకునే ఆడియన్స్ కి ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు. సినిమాలో కథ వుంది. అది కూడా సింపుల్ కథే. హింసాత్మక గతం వున్న ఓ వ్యక్తి, మామూలు జీవితం గడుపుతుంటాడు. హింస మళ్ళీ అతని జీవితంలో వచ్చాక ఏం జరిగిందనే బేసిక్ లైన్. ఈ లైన్ కూడా ఎక్కడో అట్టడుగున వుంటుంది. ఏ పాత్రకు కూడా సరైన నేపధ్యం, పరిచయం వుండవు. న్యూ ఏజ్ ఆడియన్స్ కి ఈ ఫార్మెట్ ఓకే కానీ ఒక పద్దతికి అలవాటు పడిన ప్రేక్షకులకు ఈ ట్రీట్మెంట్ కనెక్ట్ కాకపోవచ్చు. కొన్ని సీన్స్ చరుకుగా ముందుకు కదిలాయి కానీ చాలా వరకూ అవసరానికి మించిన నిడివిలో సీన్ `సాగుతోంది` అనే ఫీలింగ్ కలుగుతుంది.
‘తంగలాన్’ తర్వాత విక్రమ్ నుంచి వచ్చిన సినిమా ఇది. దానికి దీనికి పూర్తి వైవిధ్యం చూపించాడు. ఇందులో తనది హీరో పాత్ర అనడం కంటే ఓ క్యారెక్టర్ గానే చూడాలి. అది కూడా మంచికి చెడుకి మధ్య ఊగిసలాడే పాత్ర. చాలా చోట్ల అండర్ ప్లే చేస్తాడు. ఓ రెండు చోట్ల ఆ పాత్ర విరుచుకుపడే తీరు బాగా కుదిరింది. ఎస్జే సూర్యకి మరో వెరైటీ రోల్ దొరికింది. పచ్చి అవకాశవాది పాత్ర. ఈ క్యారెక్టర్ కి కూడా బ్యాక్ స్టొరీ వుంది కానీ అ పార్ట్‌లో అది చూపించే అవకాశం రాలేదు. తను డైలాగ్ చెప్పే విధానం మరోసారి అలరించింది. ఈ సినిమాలో నవ్వులకి ఏ మాత్రం స్కోప్ లేదు. కానీ అంత సీరియస్ ట్రాక్ లో కూడా తన మేనరిజం డైలాగ్ డిక్షన్ తో అప్రయత్నంగా నవ్వుతెప్పిస్తాడు. ‘కాళి’ అనే పేరుని తను డిఫరెంట్ స్టయిల్ లో ఒకొక్కసారి ఒక్కోలా పలికిన విధానం భలే గమ్మత్తుగా వుంటుంది. ఎన్ కౌంటర్ ఎలా చేయాలో, ఎలా బుల్లెట్లు దించాలో చెప్పే ఓ సీన్ అయితే నవ్వులు పంచుతుంది.
కన్నా పాత్రలో సూరజ్ వెంజరమూడు విజృంభించాడు. ప్రీక్లైమాక్స్ లో తన నటన కట్టిపడేస్తుంది. రవి పాత్రలో చేసిన పృథ్వీ రాజ్ కి నిజంగానే ఇది కెరీర్ బెస్ట్ రోల్ అనే చెప్పాలి. సినిమా అంతా తన చుట్టూనే తిరుగుతుంది. పృథ్వీకి ఇంత వెయిట్ వున్న పాత్ర దక్కడం, అందులో ఆయన రాణించడం నిజంగానే సర్ప్రైజ్. వాణి పాత్రలో చేసిన తుషారా విజయన్ నటన కూడా సహజంగా వుంది. ఆ పాత్రలో కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ వుంది. అది ఫస్ట్ పార్ట్ కి షిఫ్ట్ చేశారు. జీవి ప్రకాష్ నేపధ్య సంగీతం సాలిడ్ గా వుంది. ఎక్కడా అతి చేయకుండా క్యారెక్టర్ ఎమోషన్ కి సరిపడా సంగీతం వినిపించాడు. తెలుగు డబ్బింగ్ డీసెంట్ గా వుంది. యాక్షన్ మాస్టర్స్ కి ఫుల్ మార్కులు పడిపోతాయి. వీర ధీర శూర గొప్ప కథ కథనాలతో ప్రేక్షకులని అబ్బురపరిచే సినిమా అయితే కాదు కానీ, ఒక కొత్తరకం యాక్షన్, టేకింగ్, పెర్ఫార్మెన్స్ చూడాలనుకునే ఆడియన్స్ కి మంచి ఛాయిస్.
తెలుగు360 రేటింగ్: 2.75/5