“ కట్టె విరుగదు, పాము చావదు”. కుళ్లిన రాజకీయ వ్యవస్థను బాగు చేయడానికి తమను తాము సంస్కరించుకుంటామని రాజకీయ నేతలు చెబితే.. దానికి వారు ఏమైనా చర్యలు తీసుకుంటే ఇలాగే తీసుకుంటారు. ఆ చట్టాల వల్ల కట్టె విరగదు.. పాము చావదు. దానికి సాక్ష్యం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. చేయడానికి చట్టం అయితే చేశారు కానీ దాని వల్ల మంచి జరగకపోగా చెడే ఎక్కువగా జరుగుతోంది. నైతిక విలువలు అనేవి లేకుండా ఆ చట్టం చేస్తోంది. చట్టం చేసిన కాంగ్రెస్ పార్టీది ఎంత బాధ్యత ఉందో..దాన్ని ఉపయోగించుకుంటున్న అన్ని పార్టీలకూ అంతే భాగం ఉంటుంది. మీరు చేసిందేమిటి అని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ తమ నీచ రాజకీయాలు తాము చేసేసుకుంటున్నారు. ప్రజలకు అసహ్యం కలిగిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి తీరని నష్టం కలిగిస్తున్నారు.
ఉపఎన్నికలు రావని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు రేవంత్ భరోసా
“ఉపఎన్నికలు రానే రావు.. గతంలో రాని ఉపఎన్నికలు ఇప్పుడు ఎలా వస్తాయి” అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే నేరుగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు. సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ రెడ్డి తీర్పు ఎలా చెబుతారని బీఆర్ఎస్ భగ్గుమంది. అయితే అసెంబ్లీలో ఏం మాట్లాడాలన్న దానిపై సభ్యులకు ఎలాంటి చట్టపరమైన ఆంక్షలు లేవు. ఏం మాట్లాడినా అది నైతిక పరమైన అంశమే తప్ప ఎవరూ అడ్డుకునేది లేదు. ఏదైనా మాట్లాడవచ్చు. తనకు ఉన్న హక్కు ప్రకారం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడిన దానికి బేస్ ఉంది. గతంలో బీఆర్ఎస్ కూడా ఎమ్మెల్యేలను ఆకర్షించింది. తలసాని, సబిత వంటి వేరే పార్టీ ఎమ్మెల్యేలు అయినప్పటికీ మంత్రిగా కూడా ప్రమాణం చేయించారు. అలాంటి పరిస్థితుల్లో కూడా సదరు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు పడలేదు. మరి ఇప్పుడు ఎందుకు పడుతుందని.. అప్పుడొక రాజ్యాంగం.. ఇప్పుడొక రాజ్యాంగం ఉందా అన్నది రేవంత్ ప్రశ్న. నిజమే .. రాజ్యాంగం ఒకటే ఉంది. అందుకే అనర్హతా వేటు పడదని ఆయన నమ్మకం. అయితే సుప్రీంకోర్టు నుంచి ఏవైనా ఆదేశాలు స్పీకర్ కు వస్తే దాన్ని పాటించబోమని ఆయన సంకేతాలు ఇలా ఇచ్చారని అనుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్ల విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఎప్పటి లోపు నిర్ణయం తీసుకుంటారో తేల్చకపోతే.. తామే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని అసెంబ్లీ సెక్రటకరీగా గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. అయితే తాజా విచారణలో తాము గడువు నిర్దేశించలేమని గతంలో రాజ్యాంగ ధర్మాసనాలు స్పష్టంగా చెప్పినప్పుడు తాము ఎలా ఆ తీర్పుల్ని అధిగమించగలమని జస్టిస్ గవాయ్ పిటిషన్ల తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. ఇక్కడ ఓ అంశం కీలకం అయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పటికీ అధికారికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేశారు. ఇది రికార్డెడ్. అంటే పార్టీ మార్పు జరిగిపోయింది. మిగిలిన వారు తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పుకోవచ్చు. న్యాయస్థానం కళ్లకు గంతలు కట్టవచ్చు. కానీ దానం విషయంలో ఏం చేయాలి ?. ఏదో ఒకటి చేయాలని సుప్రీంకోర్టు అనుకుంటోంది. అలాంటి పరిస్థితులు రావొద్దనే ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీలో మాట్లాడారని అనుకోవచ్చు.
ఫిరాయింపుల నిరోధక చట్టం – అధికార పార్టీకి చుట్టం
దేశవ్యాప్తంగా ఎన్నో ఫిరాయింపులు జరిగాయి. జరుగుతున్నాయి. కానీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎప్పుడూ న్యాయంగా చర్యలు తీసుకోలేదు. అధికార పార్టీ నుంచి ఫిరాయిస్తే మాత్రం స్పీకర్ వెంటనే వేటు వేస్తారు. అదే ఇతర పార్టీల నుంచి అధికార పార్టీలో చేరితే మాత్రం వారిపై నిర్ణయం తీసుకోరు. ఎందుకంటే స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలనేది ఆయన విచక్షణాధికారానికే చట్టం వదిలేసింది. ఈ ఒక్క లూప్ హోల్‌తో అధికారంలో ఉండే రాజకీయ పార్టీలు ఫిరాయింపుల రాజకీయాన్ని వాడుతున్నాయి. 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని చేర్చారు. రాజకీయ పార్టీల మధ్య ఫిరాయింపులను నిరోధించడం, రాజకీయ స్థిరత్వాన్ని కాపాడడం కోసం దీన్ని తెచ్చామని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ చట్టం పార్లమెంటు , రాష్ట్ర శాసనసభల సభ్యులకు వర్తించేలా రూపొందించారు. రాష్ట్రాల పునర్విభజన తర్వాత రాజకీయాలు ఊపందుకున్న తర్వాత రాజకీయ అస్థిరత ఏర్పడటం సహజంగా మారింది. ఎన్నికైన ప్రతినిధులు తరచూ పార్టీలు మారడం వల్ల ప్రభుత్వాలు కూలిపోయాయి. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చారు.
కాంగ్రెస్ చేసిన తప్పు ఆ పార్టీని వేటాడింది – అయినా అదే తప్పు
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ స్వచ్చంగా ఆలోచించి ఈ చట్టం చేసి ఉంటే భారత రాజకీయాలకు గొప్ప సంస్కరణ అయ్యేది. కానీ అప్పటికి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో తమకు ఉన్న పట్టును నిలబెట్టుకునేందుకు తమకు మాత్రమే ఆ చట్టం ఉపయోగపడేలా లోపాలతో ఆమోదించారు. ఎవరైనా సభ్యుడు ఫిరాయిస్తే అనర్హత వేటు స్పీకర్ వేయాలి. అనర్హత పిటిషన్‌పై స్పీకర్/సభాపతి సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ సహేతుకమైన సమయం అంటే ఎంత కాలం అనేది చట్టంలో నిర్దేశించలేదు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండేవి.. స్పీకర్లు కూడా ఆయా ప్రభుత్వాలు, పార్టీలకు చెందిన వారు ఉంటారు. ఆ కారణంగా ఎవరైనా కాంగ్రెస్ లో చేరితే అనర్హతా వేటు విషయంలోస్పీకర్ నిర్ణయం తీసుకునేవారు కాదు. కానీ కాంగ్రెస్ నుంచి వెళ్లిపోతే మాత్రం వెంటనే వేటు వేసేవారు. అయితే ఇలాంటి చట్టాలు చేయడం ఎంత ప్రమాదకరమో కాంగ్రెస్ పార్టీకి త్వరగానే తెలిసి వచ్చింది. మొదట్లో ఆ పార్టీ వాడుకున్నా తర్వాత ఇతర పార్టీలకు అది అస్త్రంగా మారాయి. భారతీయ జనతా పార్టీ సహా అనేక ప్రాంతీయ పార్టీలు ఫిరాయింపుల నిరోధకచట్టంలో ని లోపాలతో కాంగ్రెస్ పార్టీని ఓ ఆట ఆడుకున్నాయి. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ఎంత నష్టపోయిందో అందరూ చూస్తున్నారు. చివరికి కాంగ్రెస్ పార్టీ ఈ చట్టం కారణంగా విలీనాలకూ గురయింది. ఈ చట్టంలో ఒక రాజకీయ పార్టీ మరొక పార్టీలో విలీనమైతే, ఆ పార్టీ సభ్యులు అనర్హతకు గురికారు … విలీనం కనీసం ఆ పార్టీలోని మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతుతో జరగాలన్న నిబంధన ఉంది. దీన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ రెండు సార్లు తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకున్నారు. నిజానికి చట్టంలో పార్టీ విలీనం అని ఉంది. కానీ కేసీఆర్ దానికి శాసనసభాపక్షం అనే భాష్యం చెప్పుకుని విలీనం చేసుకున్నారు. అలాంటి బాధలు పడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరోసారి అవే తప్పులు చేస్తోంది. ఫిరాయింపుల నిరోధక చట్టంను అడ్డం పెట్టుకుని తమ సభ్యులను లాక్కుని అనర్హతా వేటు వేయకుండా చేశారు కాబట్టి ఇప్పుడు తాము అదే చేస్తామని అంటున్నారు. అసలు ఆట ప్రారంభించింది కాంగ్రెస్.. తీవ్రంగా నష్టపోయింది కాంగ్రెస్.. మళ్లీ అదే ఆట ఆడుతోంది కాంగ్రెస్.
చట్టంలో లోపాలను ఎందుకు సరిదిద్దరు ?
ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులో ఉన్నప్పటికీ దాని ప్రభావం వల్ల రాజకీయం మరింత కాలుష్యం అవుతోంది. రాజకీయ పార్టీలు తమ సభ్యులను ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి మార్చడానికి విలీనం లేదా ఇతర వ్యూహాలను ఉపయోగిస్తున్నాయి. ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని, స్పీకర్ అధికారాలను నిష్పక్షపాతంగా మార్చాలని పలు సంస్కరణ ప్రతిపాదనలు చర్చల్లో ఉన్నాయి. ఫిరాయింపుల నిరోధక చట్టం భారత రాజకీయ వ్యవస్థలో స్థిరత్వం తీసుకురావడానికి రూపొందించినా కానీ తమకు అనుకూలంగా ఉంచుకునేందుకు పెట్టిన లూప్ హోల్స్ తో చట్టం అర్థం మారిపోయింది. అది రాను రాను దుర్వినియోగం అవుతోంది. ఈ చట్టాన్ని ఎవరు అధికారంలో ఉంటే వారు ఉపయోగించుకుని ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. దీన్ని అరికట్టాలంటే.. స్వచ్చందంగా అన్ని పార్టీలు ముందుకు రావాల్సి ఉంటుంది. ఒకే ఒక్క నిబంధనల చట్టంలో మార్పులు చేస్తే చాలు.. చట్టం అత్యంత బలంగా మారుతుందని అంటున్నారు. అది స్పీకర్ కు కాలపరిమితి పెట్టడం. అనర్హతా వేటు నిర్ణయం అనేది స్పీకర్ విచక్షణాధికారం … అందుకు గడువు కూడా చట్టంలో నిర్దేశించలేదు. అందుకే తరచూ కోర్టులు కూడా ఎప్పటికి నిర్ణయం తీసుకుంటారని స్పీకర్లను ప్రశ్నించాల్సి వస్తోంది. కానీ స్పీకర్లు అంతా తమ రాజ్యాంగ అధికారాన్ని తమ పార్టీ రాజకీయ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలంటే.. ఉన్నపళంగా చట్టానికి సవరణ చేయాలి. పార్టీ మారితే అనర్హతా వేటుపడేలా .. ఏ పార్టీ అయినా సరే ఒకే రకంగా చట్టం అన్వయించేలా మార్పు చేయగలగాలి. స్పీకర్ నిర్ణయాధికారాన్ని అంతే కొనసాగించవచ్చు కానీ.. ఆ నిర్ణయం వెంటనే జరిగిపోయేలా చూడాల్సి ఉంది. ఫిరాయించిన ఐదేళ్లకు ఎన్నికలకు ముందు అనర్హతా వేటు వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అది చట్టం స్ఫూర్తిని దుర్వినియోగం చేయడమే అవుతుంది. ఈ పాపంలో అన్ని రాజకీయ పార్టీలకూ భాగం ఉంది. తప్పు చేసింది వారే కాబట్టి.. దిద్దుకోవాల్సింది కూడా వారే.
నైతికతే లేని రాజకీయాలు
నిజానికి నైతిక పరమైన రాజకీయాల గురించి ఆలోచిస్తే.. ఇలా పార్టీ మార్పు అనే ఆలోచన వచ్చిన మరుక్షణం పదవుల్ని వదిలేయాలి. బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన వారికి.. ప్రజలు బీఆర్ఎస్ కోసమే ఓట్లు వేశారు. వారు కాంగ్రెస్ పార్టీలో చేరితే ప్రజల్ని మోసం చేసినట్లే. అలాగే ప్రజలు కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ చేరినా అంతే. చట్టాన్ని ఒకరిని మించి ఒకరు దుర్వినియోగం చేస్తూ.. ఒక పార్టీ ఎప్పుడూ మరో పార్టీకి నీతులు చెప్పే ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో చట్టాన్ని అత్యంత ఘోరంగా దుర్వినియోగం చేసింది. కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నామని చెప్పుకుంది కానీ.. చట్టంలోని లోపాలను నిస్సిగ్గుగా వాడుకునేలా చేసుకుని.. మీరు కూడా చేశారు కదా అని ఇతరులు చేసేలా చేసింది బీఆర్ఎస్ నాయకత్వం. ఇప్పుడు ఫలితం అనుభవిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాడు బాధితపార్టీ..నేడు బాధిస్తున్న పార్టీ. ఈ సైకిల్ ఇలా మారుతూనే ఉంటుంది. అందరూ శాకాహారులే..కానీ బుట్టలో చేపలు మాయమైపోయాయన్నట్లుగా రాజకీయ నేతలు తీరు ఉంది. ఇది మారాలంటే వారి చేతుల్లోనే ఉంది. చట్టాన్ని బలోపేతం చేస్తే.. ఆ చట్టం తర్వాత వారికి కూడా అండగా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ఆయుధంగా చేసుకుంటే రేపు ఆ ఆయుధానికే తాము కూడా బలి కావాల్సి వస్తుంది. మరి రాజకీయ పార్టీలే తేల్చుకోవాలి.