తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై ఆ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. నలుగురు, ఐదుగురు నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పైకి మాత్రం తాము రేసులో లేమని హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. పార్టీ హైకమాండ్ ఏం ఆలోచిస్తుందో ఇంకా స్పష్టత రాలేదు. ఎవరికీ సంకేతాలు రాలేదు. దాంతో అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.
హైకమాండ్ ముందు కఠిన ప్రశ్న
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కుమార్ ను ఎన్నికలకు ఐదు నెలల ముందుకు ఎందుకు తప్పించారో.. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ఎందుకు ఇచ్చారో సగటు బీజేపీ కార్యకర్తలకు ఇప్పటికీ అర్థం కాదు. కేంద్ర మంత్రిగా ఉంటే.. ఓ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగించేందుకు బీజేపీ పెద్దలు సిద్ధంగా ఉండరు. ఒకరికి ఒకే పదవి గట్టిగా అమలు చేస్తారు. అయితే కొంత కాలం అమిత్ షాకు మాత్రమే మినహాయింపు లభించింది. ఆయనకంటే ఎక్కువగా కిషన్ రెడ్డికి జోడు పదవుల అవకాశం దక్కింది. దీనికి కారణం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో బీజేపీ పెద్దలు ఉండటమేనని అంటున్నారు.
ఈ సారి ఎంపిక తేడా వస్తే పార్టీ అధికారంలోకి రావడం కల్ల
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాబోయే వారిపై చాలా పెద్ద పని ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు ఊపులో ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా ఓటు బ్యాంక్ పెంచుకున్నారు. బీఆర్ఎస్ ఓటు బ్యాంకును క్రమంగా తమ వైపు తిప్పుకుంటున్నారు. ఇటు వంటి సమయంలో దూకుడుగా ఉండి పార్టీని యాక్టివ్ గా ఉంచుతూ …. కార్యకర్తలను పార్టీ పని మీద ఉంచే నాయకుడ్ని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ సారి తప్పు జరిగితే బీజేపీకి మరోసారి అధికారం అందని ద్రాక్షే అవుతుంది.
బండి సంజయే మంచి చాయిస్ అన్నది క్యాడర్ అభిప్రాయం
బండి సంజయ్ టీ బీజేపీ చీఫ్ గా నియమితులు కాక ముందు బీజేపీ పరిస్థితి ఘోరంగా ఉండేది. కానీ ఆయన పదవి చేపట్టాక ఎవరేమనుకున్నా.. తనదైన శైలిలో పార్టీని బలోపేతం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే అసెంబ్లీ పోరు జరుగుతుందన్న సమయంలో ఆయనను మార్చడంతో ఒక్క సారిగా సీన్ మారిపోయింది. పార్టీ హైకమాండ్ వ్యూహం ఏమిటో కానీ ఇప్పుడు మరోసారి అలాంటి తప్పు చేయవద్దని.. బండి సంజయ్ కే చాన్స్ ఇవ్వాలని క్యాడర్ కోరుకుంటున్నారు. ఇతరులకు చాన్సిస్తే అది మరో తప్పిదమవుతుందని అనుకుంటున్నారు.