Robinhood Movie Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
ఛలో, భీష్మ.. ఈ రెండు సినిమాలతో వెంకీ కుడుముల శక్తి సామర్థ్యాలు అర్థమయ్యాయి. కథ సింపుల్ గా ఉన్నా, తన రైటింగ్ స్టైల్ తో మ్యాజిక్ చేయగలడని అర్థమైంది. త్రివిక్రమ్ శిష్యుడు కాబట్టి, పెన్ పవర్ పై నమ్మకాలు మొదలయ్యాయి. తన నుంచి ముచ్చటగా మూడో సినిమా ‘రాబిన్ హుడ్’ రూపంలో ముస్తాబైంది. ‘భీష్మ’ సెంటిమెంట్ ఈసారి పక్కగా వర్కవుట్ అవుతుందన్నది అందరి భరోసా. నితిన్ కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకొన్నాడు. ప్రమోషన్లు భలే వెరైటీగా చేశారు. డేవిడ్ వార్నర్ గెస్ట్ అప్పీరియన్స్, కేతిక శర్మ ఐటెమ్ నెంబర్.. ఇవి రెండూ అందరి దృష్టీ ఈ సినిమాపై పడేలా చేశాయి. సడన్‌గా ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఇవన్నీ కలగలిపిన ‘రాబిన్ హుడ్’ ఎలా వుంది? నితిన్ నమ్మకం నిజమైందా? ‘భీష్మ’ కాంబో మళ్లీ మ్యాజిక్ చేసిందా?
రామ్ (నితిన్) ఓ అనాథ. ఆశ్రమంలో పెరుగుతుంటాడు. ఫండింగ్ లేక డీలా పడిన ఆశ్రమానికి.. తన వంతు సాయం చేయడానికి రాబిన్ హుడ్ అవతారం ఎత్తుతాడు. ఉన్నవాళ్ల దగ్గర దోచుకొని, ఆశ్రమాలకు దానం చేస్తుంటాడు. పోలీసుల నిఘా ఎక్కువ అవ్వడంతో కొన్నాళ్లు దొంగతనాలకు కామా పెట్టాలని డిసైడ్ అవుతాడు. అదే సమయంలో.. ఓ సెక్యురిటీ ఏజెన్సీలో ఉద్యోగం దొరుకుతుంది. అందులో భాగంగానే ఆస్ట్రేలియా నుంచి వచ్చిన నీరా వాసుదేవ్ (శ్రీలీల)కు సెక్యురిటీ ఇవ్వాల్సివస్తుంది. అయితే అనుకోకుండా నీరాని ఓ ముఠా వెంబడిస్తుంది. అసలు నీరా ఎవరు? తనకు వచ్చిన ఆపద ఏమిటి? అందులోంచి నీరాని రామ్ ఎలా కాపాడగలిగాడు? ఈ రాబిన్ హుడ్ పోలీసులకు దొరికాడా, లేదా? అనేదే మిగిలిన స్టోరీ.
రాబిన్ హుడ్ అంటే ఎవరు? అతని గుణగణాలేమిటి? అనే విషయాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నవాళ్ల దగ్గర దోచుకొని, లేనివాళ్లకు పెట్టేవాడే రాబిన్ హుడ్. ఈ కథ కూడా అలాంటిదే. ఈ జోనర్లో వచ్చిన సినిమాలు హిట్ అయ్యాయి. నితిన్ కు ఇలాంటి పాత్ర ఎంచుకోవడం ఇదే తొలిసారి. పైగా `భీష్మ`తో వెంకీ కుడుముల పని తనం తెలిసొచ్చింది. అందుకే ఎలాంటి అనుమానాలూ లేకుండా ఈ కథకు ఓకే చెప్పేసి ఉంటాడు. ‘రాబిన్ హుడ్’ తొలి సన్నివేశాలు సరదాగానే సాగుతాయి. హీరో చేసే దొంగతనాలు, పోలీసుల్ని పక్క దోవ పట్టించడం, ఆ వెంటనే సెక్యురిటీ ఏజెన్సీలో జాయిన్ అవ్వడం… ఇలాంటి సన్నివేశాల్ని బాగానే రాసుకొన్నాడు వెంకీ కుడుముల. రాజేంద్ర ప్రసాద్ ఏజెన్సీ చుట్టూ సాగిన సీన్స్, వెన్నెల కిషోర్ అత్యుత్సాహం నవ్వులు పంచుతాయి. కాకపోతే ఈ కథలో గంజాయి మాఫియా పోర్షన్ అంతగా అతకలేదు. వాటికి సంబంధించిన సన్నివేశాలన్నీ ఫోర్స్ఫుల్గానే అనిపిస్తాయి. టైటిల్ రాబిన్ హుడ్ అయినా – వాటికి సంబంధించిన ఎపిసోడ్లు చాలా తక్కువ. కేవలం ఈ పార్ట్ కి కేవలం హుక్గానే వాడుకొన్నాడు దర్శకుడు.
తొలి సగంలో వెన్నెల కిషోర్ కామెడీ వర్కవుట్ అయ్యింది. రెండో సగంలో ‘ట్రూత్ ఆర్ డేర్’ సీన్ ఒకటి నవ్వులు పంచుతుంది. వెన్నెల కిషోర్ రియలైజేషన్ కూడా ఫన్ క్రియేట్ చేసింది. ఇది మినహా కామెడీకి పెద్దగా స్కోప్ దొరకలేదు. హీరో ఇంటిలిజెంట్ ప్లే కూడా పెద్దగా మెప్పించలేదు. విడుదలకు ముందు వివాదం సృష్టించిన ‘అదిదా సర్ప్రైజ్’ పాటలోని ‘హుక్’ ప్టెప్ కనిపించకపోవడం ప్రేక్షకులకు అసలు సర్ప్రైజ్. డేవిడ్ వార్నర్ ఎంట్రీ గురించి ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకొన్నారు. డేవిడ్ వార్నర్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. కాకపోతే.. వార్నర్‌ని సరిగా వాడుకోలేదు. అతని రాక కథకు గానీ, సన్నివేశానికి గానీ ఎలాంటి ఇంపాక్ట్ తీసుకురాలేకపోయింది. ఊరులో మనుషుల్ని విలన్ రిప్లేస్ చేసే సీన్ బాగుంది. చివర్లో దాన్ని హీరో వాడుకొంటాడు కూడా. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లోలా కాకుండా క్లైమాక్స్‌ని కాస్త కొత్తగా డిజైన్ చేయాలన్న ప్రయత్నం కనిపించింది. అక్కడ కూడా మామూలు ఫైట్ పెట్టి ఉంటే ఇంకాస్త బోరింగ్ గా ఉండేది. మైమ్ గోపీ ని సైడ్ విలన్ చేసేశారు. కాకపోతే.. విలన్ కంటే తానే ప్రమాదకారిగా కనిపిస్తాడు. అదీ కాసేపే. ఆ తరవాత హీరో ఆటోమెటిగ్గా అలాంటి పర్సనాలిటీని కూడా జోకర్‌గా మార్చేశాడు. విలన్ పాత్ర హీరోలకు ఇంత సింపుల్ గా లొంగిపోతే మజా ఏముంటుంది? హీరో ఏం చేసినా చెల్లుబాటు అయిపోతున్నప్పుడు, విలన్లు కూడా ఈజీగా బకరాలు అయిపోతున్నప్పుడు ఇంపాక్ట్ క్రియేట్ అవ్వదు. ఈసారీ అదే జరిగింది.
నితిన్ ఎప్పటిలా హుషారుగా చేశాడు. తనలో ఈజ్ నచ్చుతుంది. డాన్స్ మూమెంట్స్ సింపుల్ గా ఉన్నాయి. కాస్ట్యూమ్స్ కూడా నచ్చుతాయి. శ్రీలీల పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. తను కూడా ఏదో అలా.. అలా చేసుకొంటూ వెళ్లిపోయింది. అసలు ఈ పాత్రని డిజైన్ చేసిన విధానమే సరిగా అనిపించదు. రాజేంద్ర ప్రసాద్ – వెన్నెల కిషోర్ మధ్య ట్రాక్ బాగుంది. ఫస్టాఫ్‌లో అదే కాస్త సేవ్ చేసింది. అలాంటి ట్రాక్ సెకండాఫ్‌లోనూ ఉంటే బాగుండేది. మైమ్ గోపీని సైతం సరిగా వాడుకోలేదు. విలన్ గంభీరంగా ఉన్నాడు. కానీ హీరో ముందు రొటీన్‌గా కుదేలైపోయాడు.
వెంకీ కుడుముల బలం రైటింగ్. సాదాసీదా కథని సైతం బాగా చెప్పగలడన్న నమ్మకం తన రెండు సినిమాలతో దక్కించుకొన్నాడు. అయితే ఈసారి కథ విషయంలో దొరికిపోయాడు. బేస్ లేకుండా పైపైన ఎంత కామెడీ చేయాలని చూసినా అతకదు. ‘రాబిన్ హుడ్’లో ఆ లోపం కనిపించింది. తనలో కామెడీ పంచ్‌కు కొదవ లేదు. కానీ సరైన బేస్ ఉండాలి. అప్పుడు రాసిన డైలాగ్ నిలబడుతుంది. పంచ్ పేలుతుంది. ఈసారి తను కథ, కథనాలపైనా దృష్టి పెడితే బాగుంటుంది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. వాటిని బాగానే పిక్చరైజ్ చేశారు. మైత్రీ మూవీస్ బాగానే ఖర్చు పెట్టింది. మొత్తంగా చెప్పాలంటే ఎలాంటి అంచనాలూ లేకుండా చూస్తే… రాబిన్ హుడ్ అక్కడక్కడ కొన్ని నవ్వులతో టైమ్ పాస్ చేస్తాడు.
తెలుగు360 రేటింగ్: 2.5/5