పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న నాలుగు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారుల తీరుపై పవన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారిపై అనేక ఫిర్యాదులు వస్తూండటంతో ఆయన నాలుగు పోలీస్ స్టేషన్లపై ఇంటలిజెన్స్ రిపోర్టులు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ ఆదేశాలు కలకలం రేపాయి. పవన్ కు అంత కోపం రావడానికి గల కారణాలేమిటన్నదానిపై జనసేనవర్గాలకూ ఓ క్లూ రావడం లేదు.
పిఠాపురం నియోజకవర్గంలో పూర్తి జనసేన తరపున పవన్ కు అత్యంత సన్నిహితమైన వారు సిఫారసు చేసిన అధికారులే విధులు నిర్వహిస్తున్నారు. వైసీపీ హయాంలో పని చేస్తున్న వారిని మార్చారు. మారకుండా ఎవరైనా ఉన్నారంటే.. జనసేన పెద్దల ఆశీర్వాదం ఉన్నవారే. అయినా వారిపై పవన్ ఎందుకు అంత అసహనంతో ఉన్నారో పిఠాపురం జనసేన నేతలకూ సస్పెన్స్ గానే ఉంది.
పవన్ కల్యాణ్ తన పేరు దుర్వినియోగం విషయంలో సీరియస్ గా ఉన్నారని చెబుతున్నారు. నేరాలు చేస్తున్న వారికి పార్టీలతో సంబంధం ఉండని ఎవరైనా చర్యలు తీసుకోవాల్సిందేనని అంటున్నారు. అయితే పిఠాపురం నియోజకవరంలో పవన్ కల్యాణ్ పేరు చెప్పి.. జనసేన పేరు చెప్పి చేసే దందాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదని పవన్ భావిస్తున్నారు. అదే సమయంలో ఆయన ఆశించిన మేర నేరాల కట్టడి జరగలేదన్నారు భావనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. అందుకే ఆయన ఆయా పోలీస్ స్టేషన్లపై ఇంటలిజెన్స్ రిపోర్టు అడిగినట్లుగా చెబుతున్నారు.