ఇప్పుడు ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోంది.. భవిష్యత్ భారతీయులదేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మద్రాస్ ఐఐటీలో జరిగిన రీసెర్చ్ స్కానర్స్ సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మద్రాస్ ఐఐటీ నుంచి వస్తున్న పట్టభద్రులు ఏర్పాటు చేస్తున్న స్టార్టప్స్ సక్సెస్ రేటు 80 శాతం ఉందన్నారు. మద్రాస్ ఐఐటీలో నలభై శాతం వరకూ తెలుగు విద్యార్థులు చదువుతున్నారని గుర్తు చేసుకున్నారు.
ఐఐటీ మద్రాస్ అనేక విషయాల్లో దేశలోనే నెంబర్ వన్ గా ఉందన్నారు. అగ్నికుల్ స్టార్టప్ గురించి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఐఐటీ మద్రాస్ లో ప్రసంగించేందుకు చంద్రబాబు చెన్నై వెళ్లారు. ఈ సమావేశానికి చంద్రబాబు రాకతోనే అందరూ చప్పట్లతో స్వాగతం పలికారు. చంద్రబాబు పరిచయ ప్రసంగాన్ని నిర్వాహకులు చదువుతున్నప్పుడు.. చప్పట్లతో ఆడిటోరియం హోరెత్తింది.
చంద్రబాబును ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రసంగాలకు ఆయా సంస్థల యాజమాన్యాలు ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉంటాయి. సివిల్ సర్వీస్ అధికారులకు ట్రైనింగ్ ఇచ్చే ముస్సోరి క్యాంపస్ నుంచి కూడా చంద్రబాబుకు ఆహ్వానాలు వస్తూంటాయి. పలుమార్లు అక్కడ ప్రసంగించారు. దేశంలోని అత్యంత సీనియర్ నేతల్లో ఒకరు అయిన చంద్రబాబు.. వ్యవస్ధల మెరుగుదల కోసం తన అనుభవాలను వివరిస్తూ ఉంటారు.