నాగబాబు మార్చిలో మంత్రిగా ప్రమాణం చేస్తారని ఓ సారి మీడియా చిట్ చాట్ లో పవన్ కల్యాణ్ చెప్పారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంది కాబట్టి అప్పుడే మంత్రి పదవి పొందుతారన్నారు. ముందుగానే ప్రమాణం చేయించి తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నా.. తొందరేం లేదని పద్దతి ప్రకారమే వెళ్లాలనుకుంటున్నామని పవన్ చెప్పారు.తెలుగుదేశం పార్టీ కూడా అధికారికంగా నాగబాబును మంత్రివర్గంలో తీసుకుంటామని ప్రకటించారు. ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. మంత్రి ఎప్పుడు అవుతారన్న చర్చ ప్రారంభమయింది.
పవన్ కల్యాణ్, చంద్రబాబు మధ్య ఎప్పుడు భేటీ జరిగినా నాగబాబు మంత్రి పదవి, ఆయనకు కేటాయించే శాఖలపైనే చర్చ జరిగిందని మీడియాలో ప్రచారం జరుగుతుంది. కానీ మార్చిలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటి వరకూ మంత్రి వర్గ విస్తరణపై చంద్రబాబు కసరత్తు చేయలేదు. అయితే ఇక్కడ కసరత్తు చేయడానికేమీ లేదు ఉన్నది ఒక్కటే ఖాళీ. అందులో నాగబాబును తీసుకుంటున్నారు. కానీ చంద్రబాబు మంత్రుల పనితీరును బట్టి కొన్ని శాఖలు మార్చడమో.. మరొకటో చేయాలని అనుకుంటున్నారని అందుకే ఆలస్యం కావొచ్చని అంటున్నారు.
నాగబాబును ఎమ్మెల్సీగా ప్రకటించకముందు ఆయన పదవిపై ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీని చేసినా సామాజిక సమీకరణాల రీత్యా ఆయనకు కేబినెట్ ర్యాంక్ తో నామినెటెడ్ పోస్టుతో సరి పెడతారని చెప్పుకున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.