హైదరాబాద్లోని కంచె గచ్చిబౌలి స్థలం వేలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపాలని అనుకుంటున్న విపక్ష పార్టీలు విచిత్రమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. అక్కడే ఏదో చిట్టడవి ఉండేదని.. వన్య ప్రాణులు హాయిగా తిరుగాడేవని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఏఐ ఫోటోలను రంగంలోకి దింపుతున్నారు. ప్రొక్లెయిన్ ఒకటి చదును చేస్తూంటే. నెమళ్లు అన్నీ చెల్లా చెదురు అయిపోయినట్లుగా కొన్ని ఏఐ ఫోటోలను బీఆర్ఎస్ సహా ఇతరులు వైరల్ చేస్తున్నారు.
ఈ వైరల్ ఉద్యమంలో ఇతరులు కూడా తమ శక్తి మేర సాయం చేస్తున్నాయి. అది పక్కాగా ఏఐ ఫోటోనే అని తెలిసినా.. రేవంత్ రెడ్డి పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. కథలు, కవితలతో హోరెత్తిస్తున్నారు. నిజానికి కంచెగచ్చిబౌలి భూములు ముఫ్పై ఏళ్ల పాటు నిరుపయోగంగా పడి ఉండటం వల్ల.. చిట్టడవిగా మారింది. ఆ ప్రాంతంలో వన్య ప్రాణాలు బతికేవన్నది ఉత్త అపోహేనని కేబీఆర్ పార్క్ వంటి జనసమ్మర్థం ఉండే చోటనే ఎక్కువగా నెమ్మళ్లు ఉంటాయని కొంత మంది సోషల్ మీడియాలో చెబుతున్నారు.
ఆ స్థలం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ఉండేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో వివేహాతర బంధాలు, ఇతర నేరాల కారణంగా కొన్ని హత్యలు కూడా జరిగాయి. అయినా ఆ భూముల్ని వేలం వేయకూడదన్న ఉద్దేశంతో.. ఏఐ ఫోటోలను రంగంలోకి దింపి మరీ రాజకీయం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈ ప్రచారాన్ని ఎలా ఎదుర్కొంటారో కానీ ఆ భూముల వేలం విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని పట్టుదలగా ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.