పరీక్షల నెలగా చెప్పే మార్చిలో సినిమాలు కూడా బాక్సాఫీసు టెస్ట్ కి వచ్చాయి. మార్చి మొదటి వారంలో చెప్పుకొదగ్గ సినిమా లేవు. నారీ, జిగేల్ అనే రెండు చిన్న సినిమాలు వచ్చాయి. అసలు ఈ సినిమాలు విడుదలైన సంగతే తెలిసిరాలేదు.
మార్చి7 బాలీవుడ్ హిట్ సినిమా ‘ఛావా’ ని గీతా ఆర్ట్స్ డబ్బింగ్ రూపంలో తీసుకొచ్చింది. శంభాజీ జీవితం ఆధారంగా నిర్మించిన ఈ సినిమా నార్త్ ఆడియన్స్ ఆకట్టుకుంది. తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందని, రిలీజ్ చేసినందుకు హ్యాపీ అని నిర్మాత బన్నీవాస్ చెప్పుకొచ్చారు. అదే రోజున మలయాళం హిట్ ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ ని మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రిలుజ్ చేసింది. అయితే సినిమాకి ఫుట్ ఫాల్స్ రాలేదు. మరుసటి వారమే నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. కానీ ఓటీటీలో చూశాక… ఈ సినిమాపై గౌరవం పెరిగింది. చాలా పకడ్బందీ స్క్రీన్ ప్లేతో రూపొందించిన సినిమా ఇది. తెలుగు ప్రేక్షకులకు నోటెడ్ అయిన నటీనటులు లేకపోవడం పెద్ద మైనస్. జీవి ప్రకాష్ కింగ్ స్టన్ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు.
‘క’విజయంతో ఫాం లోకి వచ్చిన కిరణ్ అబ్బవరం దిల్ రుబా షాక్ ఇచ్చింది. డిజాస్టర్ రిజల్ట్ వచ్చింది. అదే రోజు వచ్చిన నాని నిర్మించిన కోర్ట్ సినిమాకి మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా మంగపతి క్యారెక్టర్ లో శివాజీ నటన, ఫోక్సో యాక్ట్ నేపధ్యంలో కథ సినిమాకి ఆకర్షణగా నిలిచాయి. నిర్మాతగా నాని గౌరవం పెంచిన సినిమా ఇది. ఆర్థికపరంగానూ మంచి లాభాలొచ్చాయి.
మార్చి చివరి వారంలో విక్రమ్ వీరధీర శూర, లూసిఫర్ 2 అనే రెండు డబ్బింగ్ బొమ్మలు వచ్చాయి. విక్రమ్ వీరధీర మంచి సినిమా అనే రివ్యూలు వచ్చాయి కానీ చెప్పుకొదగ్గ వసూళ్లు రాలేదు. లూసిఫర్ 2 గ్రాండ్ గా తీసిన సినిమా. లూసిఫర్ కంటే మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో తీశారు. అయితే సినిమా వివాదంలో పడింది. తెలుగులో అనుకున్నంత కలెక్షన్స్ రాలేదు గానీ మలయాళం, ఓవర్సీస్ లో సినిమా మంచి ఫిగర్స్ రాబట్టింది.
చివరి వారంలో విడుదలైన నితిన్ రాబిన్ హుడ్ నిరాశపరిచింది. ప్రమోషన్స్ లో హుషారు చూపించిన ఈ సినిమా కంటెంట్ లో మాత్రం దెబ్బకొట్టింది. సితార బ్యానర్ లో వచ్చిన మ్యాడ్ 2కి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయితే యూత్ ఫుల్ కంటెంట్ యువతని ఆకర్షించింది. చివరి వారంలో విడుదలైన సినిమాల్లో ఈ సినిమాకే ఫుట్ ఫాల్స్ కనిపించాయి. మొత్తానికి మార్చి నెల బాక్సాఫీసు పరంగా కోర్ట్, మ్యాడ్ 2 లాంటి చిన్న చిత్రాల విజయం బాక్సాఫీసుకు ఊరట ఇచ్చాయి.