ఏపీ మద్యం స్కాంలో సైలెంట్‌గా సీఐడీ పని చేసుకుపోతోంది. కీలక పాత్రధారులకు నోటీసులు జారీ చేస్తోంది. వారంతా కోర్టుకు వెళ్తున్నారు. కానీ హైకోర్టులో మాత్రం సానుకూల ఫలితం రావడం లేదు. ఏపీ లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఆయనపై సీఐడీ ఎప్పుడో దృష్టి పెట్టింది. నోటీసులు జారీ చేసింది. ఆయన నోటీసులను తాజాగా హైకోర్టులో సవాల్ చేశారు. తనపై దూకుడైన చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసి ఆయన పిటిషన్ డిస్మిస్ చేసింది.
కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి జగన్ ఐటీ సలహాదారు పోస్టు ఇచ్చారు.కానీ ఆయన చేసింది మాత్రం మొత్తం మద్యం దందా. వాలంటీర్లు సేకరించే ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తమ సంస్థలో దాచి పెట్టుకోవడం .. అవసరమైనప్పుడు వాడుకోవడం. మధ్యం దందాలో ఆయన పాత్ర కీలకం కావడంతో సీఐడీ అధికారులు ఆయన విషయంలో అన్ని వ్యవహారాలపై సమాచారాన్ని సేకరించారు. విజయసాయిరెడ్డి కూడా ఆయన పేరే చెప్పడంతో త్వరలో అరెస్టులు ఆయనతోనే ప్రారంభమైనా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.
ఏపీ లిక్కర్ స్కాంపై సీఐడీ చాలా లోతుగా దర్యాప్తు చేసింది. చాలా విషయాలు వెలుగులోకి తెచ్చింది. ఏపీబీసీఎల్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి మొత్తం వ్యవహారాలపై రోజుల తరబడి స్టేట్ మెంట్ ఇచ్చారు. న్యాయమూర్తి ముందు కూడా వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ స్కాంలో కీలకంగా ఉన్న వారి గుట్టు అంతా బయటపడుతోందన్న ఆందోళన వైసీపీలో వినిపిస్తోంది. ఇప్పటికే మిథున్ రెడ్డికి ఈ స్కాంలో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.