తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తన పదవికి రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడ్ని నియమించడానికి వీలుగా రాజీనామా చేసినట్లుగా ప్రకటించారు. కొత్తగా మరోసారి అధ్యక్ష పదవికి తాను రేసులో లేనని చెప్పుకొచ్చారు. తమిళనాడు బీజేపీకి ఓ క్రేజ్ తీసుకు వచ్చిన లీడర్ అన్నామలై. ఆయన తనను తాను కొరడాతో కొట్టుకున్నా.. మరో విచిత్రమైన పని చేసినా ఆయన మాత్రం పార్టీని ఎప్పుడూ ప్రచారంలో ఉంచేవారు.
తెలంగాణలో బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే వరకూ బీజేపీ పరిస్థితి అంతంతమాత్రమే. అయితే ఆయన మాత్రం ఎన్ని ట్రోల్ వచ్చినా తనదైన శైలిలో ప్రకటనలు చేసి.. పోరాటాలు చేసి పార్టీని రేసులోకి తీసుకు వచ్చారు. ఎన్నికలకు ముందు ఆయనను హైకమాండ్ ఏ ఉద్దేశంతో తప్పించిందో కానీ..తప్పించింది. దాని వల్ల బీజేపీ అవకాశాలు దెబ్బతిన్నాయని అనుకున్నారు. ఇప్పుడు తమిళనాడులో కూడా వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న సమయంలో బీజేపీకి కాస్త క్రేజ్ తెచ్చి పెట్టారని భావిస్తున్న అన్నామలైతో రాజీనామా చేయించారు.
హైకమాండ్ సూచనల మేరకే అన్నామలై రాజీనామా చేసి ఉంటారు. ఆయన అంతటకు ఆయన రాజీనామా చేసే అవకాశం లేదు.ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తే ఇవ్వొచ్చు కానీ ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు తప్పించారన్నది ఆసక్తికరంగా మారింది. అన్నాడీఎంకేతో మరోసారి పొత్తుకు బీజేపీ సిద్ధమవుతోంది. అన్నామలై చీఫ్ గా ఉంటే పొత్తు పెట్టుకునేది లేదని పళనిస్వామి షరతులు పెట్టడంతో ఆయనను తప్పించినట్లుగా చెబుతున్నారు.