హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తప్పుడు ప్రచారం చేసి, ఫేక్ వీడియోలు, ఏఐ వీడియోలతో రచ్చ చేసిన వారిపై కేసులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. జాతీయ స్థాయి యూట్యూబర్లు కూడా తప్పుడు ప్రచారాలు చేశారు. తప్పలుగా మారిన ప్రాంతాన్ని చిట్టడవిగా అక్కడ జింకలు, నెమళ్లు తిరుగుతున్నట్లుగా ప్రచారం చేశారు. నాలుగు వందల ఎకరాల ప్రాంతం.. ఎప్పటికప్పుడు జనం తిరిగే ప్రాంతంలో జింకలు ఉంటాయా అనే కనీస లాజిక్ ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఈ విషయంలో ఓ పెద్ద ఫేక్ ఫ్యాక్టరీ పని చేసిందని అర్థం చేసుకోవచ్చు.
భయంకరమైన ఫేక్ ప్రచారాలు
అర్థరాత్రి వేళ రోడ్డుపై సెంట్రల్ వర్శిటీ ఎదురుగా ఉండే పాత ముంబై జాతీయ రహదారిపై వెళ్తున్న కొన్ని కన్స్ట్రక్షన్ లారీల వీడియోలను చూపించిన ఓ జాతీయ మీడియా జర్నలిస్టు అందులో కంచ గచ్చిబౌలి స్థలంలో కొట్టేసిన చెట్లను తీసుకెళ్తున్నారని స్టూడెంట్స్ చెప్పారని రాసుకొచ్చారు. గచ్చిబౌలి ప్రాంతంలో గత పదేళ్లుగా రాత్రి పది గంటల నుంచి ఉదయం వరకూ అలాంటి లారీలు కొన్ని వందలు తిరుగుతూ ఉంటాయి. కన్స్ట్రక్షన్ కోసం మెటీరియల్స్ తీసుకెళ్లడం.. తవ్వేసిన రాళ్లను తీసుకెళ్లడం వంటివి చేస్తూంటాయి. అలాంటి లారీలను చూపించి కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ జర్నలిస్టుకూ ఆ విషయం తెలుసు. కానీ వారికి కావాల్సింది ఫేక్ ప్రచారాన్ని జనంలోకి పంపడమే.
అన్నీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నవే !
ఇప్పుడు జింకలు పెద్ద ఎత్తున ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. ఇదిగో జింక.. అదిగో జింక అని వీడియోలు పెడుతున్నారు. నాలుగు వందల ఎకరాలు అంటే.. గట్టిగా ఓ కాలనీ అంత కూడా ఉండదు. పైగా అదేమీ నిర్మానుష్య ప్రాంతం కాదు. జింకలు అక్కడ పెరగడానికి అవకాశమే లేదు. ఇప్పుడు వీడియోలు చూపిస్తున్న జింకలు.. చిన్నవి కూడా కాదు. చాలా పెద్దవి. అవి ఎప్పుడు అక్కడకు వచ్చాయి… ఎప్పుడు పెరిగాయి. ఆ భూముల్లో ఎప్పుడూ ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు. డంపింగ్ గ్రౌండ్ గా కూడా కొందరు వాడుకుంటున్నారు. మరి జింకలు ఎలా పెరిగాయి ?. మొత్తం ఓ పెద్ద ఫేక్ ప్యాక్టరీకి తోడు.. ఊహించనంత కుట్ర ఈ వ్యవహారంలో కనిపిస్తోంది.
అడ్డుకోలేకపోయిన ప్రభుత్వం
కంచగచ్చిబౌలి భూముల్ని వేలం వేయకుండా అడ్డుకోవాలంటే.. పర్యావరణం పేరుతో రచ్చ చేయడమే మార్గమని మొదటి నుంచి సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దానికి తగ్గట్లుగానే పక్కా ప్లాన్ ప్రకారం.. జింకల్ని కూడా తెచ్చి రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ప్రచారాన్ని ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమయింది. ఇంటలిజెన్స్ కూడా ఏం చేయలేకపోయింది. ఈ విషయంలో ప్రభుత్వానిదే ఎక్కువ లోపం కనిపిస్తోందని అనుకోవచ్చు.