మా అన్న పులి రా పులి.. సోనియా గాంధీనే ఎదిరించాడని చెప్పుకుంటారు వైసీపీ నేతలు. సోనియా గాంధీని ఎదిరించారో లేదో కానీ బెయిల్ కోసం ఆమె వద్దకు రాయబారం పంపారని షర్మిల ప్రకటించారు. సరే ఆయన ఎదిరించారో లేదో పాత చరిత్ర. మరి ఇప్పుడు ఏం జరుగుతోంది ?. ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఓటేయడం అంటే..అదీ తమ ఓటు బ్యాంక్ అయిన ముస్లింలు వ్యతిరేకిస్తున్న బిల్లుకు అంటే.. ఏం అనుకోవాలి ?
జగన్ వలువలు విప్పేసి రోడ్డు మీద నిలబెడుతున్న బీజేపీ
వైసీపీని ముస్లింలు నమ్ముతారు. నిజానికి అది వైసీపీ నమ్మకం కాదు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా ఆ పార్టీ కి పోయింది కాబట్టి వారు నమ్ముతున్నారు. కానీ జగన్ ఏం చేస్తున్నారు ?. బీజేపీతో బంధం నడుపుతున్నారు. ఆ బంధం లీగల్ కాదు. కనీసం బంధంలో ఉన్నామన్నట్లుగా చెప్పుకోలేరు. బీజేపీ ఇతర పార్టీలతో కలిసి పాతాళానికి నెట్టేసిందని తెలిసినా .. బీజేపీ కాళ్లు వదిలిపెట్టలేనంత నిస్సహాయ బంధం. జగన్ దుస్థితిని బీజేపీ పక్కాగా ఉపయోగించుకుంటోంది. నేరుగా అడగకుండానే వచ్చి మద్దతిచ్చేలా చేసుకుంటోంది. జగన్ వలువలు విప్పేసి రోడ్డు మీద ఉండేలా చేస్తోంది.
రాజ్యసభ ఓటింగ్ తో విలువలు లేని పార్టీగా వైసీపీ
రాజ్యసభలో ఓటింగ్ సమయంలో వైసీపీ విప్ జారీ చేయలేదు. ఓటింగ్ అయిపోయిన తర్వాత విప్ జారీ చేసింది. దాని వల్ల ప్రయోజనం లేదు. వైసీపీ ఎంపీలు వక్ఫ్ బిల్లుకు మద్దతుగా ఓటేసినట్లుగా తేలింది. పరిమళ్ నత్వానీ మాత్రమే ఓటేశారని కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఐదుగురు ఎంపీలు ఆ పని చేశారని లెక్కలు చెబుతున్నాయి. అయినా వైసీపీ ముస్లింలను నమ్మించేందుకు ప్రయత్నిస్తోంది. అటు బీజేపీ కాళ్లు పట్టేసుకుని.. ఇటు ముస్లింల కోసం పోరాడుతున్నట్లుగా బిల్డప్ ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. కానీ అందరికీ తెలిసిపోయింది.
ఇంత భయం పెట్టుకుని రాజకీయాలు ఎందుకు ?
ఇవాళ బీజేపీని ధిక్కరిస్తే రేపు జైలుకు పోతానని జగన్ కు భయం. ఆయన చేసిన నేరాలు చిన్న చిన్నవి కావు. ఇవాళ కాకపోతే రేపైనా ఆయన జైలుకు పోవాల్సిందే. ఎందుకంటే బీజేపీ అయినా.. మరొకరు అయినా కొంత కాలం కాపాడగలుగుతారేమో కానీ ఎల్లకాలం కాదు. ఇప్పుడు రాజ్యసభ సభ్యుల బలం ఉంది..రేపు అది కూడా ఉండదు. అప్పుడు కాపాడాల్సిన అవసరం ఉండదు. ఈ లాజిక్ అర్థం చేసుకోకపోతే జగన్ రాజకీయంగా మరింత దిగజారడమే కానీ.. ఎదిగే చాన్స్ ఉండదు.