కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని జాతీయస్థాయి సమస్యగా ఫేక్ వీడియోలతో మార్చిన వారిపై కేసులతో విరుచుకుపడేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అయింది. ఇప్పటికే పలువురిపై కేసులు పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న యూట్యూబర్లు కూడా ఉన్నారని అంటున్నారు. అయితే ఇలాంటి కేసుల వల్ల రేవంత్ రెడ్డి సర్కార్ కు చెడ్డపేరు వస్తుంది కానీ.. వారిని కంట్రోల్ చేయలేరు. వారు చెప్పింది ఫేక్ అని ప్రజల్ని నమ్మించలేరు. కేసులు పెట్టడం కన్నా మరింత స్మార్ట్ గా ఆలోచించి.. ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టే ప్రయత్నం చేయాల్సి ఉంది.
కంచ గచ్చిబౌలి అనే ప్రాంతం చిట్టడవి కాదు. డంపింగ్ గ్రౌండ్ గా కూడా వాడుకుంటున్నారు. అలాంటి చోట వన్య ప్రాణాలు పెరిగే అవకాశం ఉంది. పైగా అది అటవీ భూమి కాదు. కానీ అది అడవి అని.. వన్య ప్రాణాలు ఉన్నాయని అందర్నీ నమ్మించేసేలా ప్రచారం చేశారు. ఇలా చేయడానికి అవకాశం ఉందని ఆ భూములు అమ్మకుండా చేయాలని అనుకున్న వారు దేనికైనా తెగిస్తారని కనీస ఇంటలిజెన్స్ సమాచారం కూడా ప్రభుత్వానికి లేకపోతే వ్యవస్థ విఫలమయినట్లే అనుకోవచ్చు.
ఆ భూముల విషయంలో గోప్యత పాటించడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకున్న దాన్ని ముందు మెల్లగా అలాంటి పని చేయబోతున్నారని ప్రజల్లోకి పంపి ఆ తర్వాత నిర్ణయం తీసుకునే వ్యూహాన్ని అధికారంలోఉన్న వారు పాటిస్తారు. కానీ రేవంత్ సర్కార్ ఈ విషయాన్ని పట్టించుకోవడంలేదు. నేరుగా రంగంలోకి దిగిపోతోంది. దీని వల్ల అనేక ఫేక్ ప్రచారాలకు అవకాశం ఏర్పడుతోంది. ఆ భూములను అమ్మాలనుకున్నప్పుడు మెల్లగా.. ప్రచారంలోకి పెట్టుకుని.. అందరూ తిరిగేలా చేసుకుని .. గ్రౌండ్ క్లియరెన్స్ చేసుకోవాలి కానీ ఇక్కడ రహస్యంగా అన్నీ చేసేయాలనుకున్నారు.
అక్కడ తుప్పలు.. పిచ్చి మొక్కలు తప్ప.. వందల ఏళ్లుగా పెరిగిన చెట్లు లేవు. మురికి గుంటల్ని చెరువులుగా చెబుతున్నారు. రేవంత్ సర్కార్ ఈ భూముల అమ్మకం విషయంలో స్మార్ట్ గా లేకపోవడం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు అందరిపై కేసులు పెట్టడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. మరిన్ని వివాదాలు తప్ప. పైగా ఆ వీడియోలు నిజం అని నమ్మేవారిని ఫేక్ అని నమ్మించలేరు కూడా.