రాజకీయాల్లో విజయానికి షార్ట్ కట్స్ ఉండవు. ప్రజల అభిమానాన్ని పొందడం ద్వారానే విజయం సాధ్యమవుతుంది. అయితే ఇది సింగిల్ పాయింట్‌గానే కనిపిస్తుంది. ఆ ప్రజల అభిమానాన్ని పొందాలంటే కుల, మత , ప్రాంత భావనల నుంచి..రాజకీయ విద్వేష వాతావరణం నుంచి అందర్నీ బయటకు తెచ్చి.. రాజకీయం చేసేది మీ బాగు కోసమే అని వారికి నమ్మకం కలిగించాలి. అది అంత తేలిక కాదు కాబట్టే చాలా మంది గాలివాటంగా గెలిస్తే చాలనుకుంటున్నారు. కానీ నారా లోకేష్ ను కేస్ స్టేడీగా తీసుకుంటే.. రాజకీయం ఎంత సక్సెస్ ఫుల్ గా చేయొచ్చో అర్థం చేసుకోవచ్చు.
ఐదేళ్లలో 90వేల మెజార్టీ అంటే ఆ ఫార్ములానే వేరు !
ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన లోకేష్.. ఐదు సంవత్సరాల తర్వాత రాష్ట్రంలోనే టాప్ త్రీ మెజార్టీ సాధించారు. ఆ నియోజకవర్గం ఏమీ కుంచుకోట కాదు. కానీ లోకేష్ పార్టీలకు అతీతంగా ఆయన మా నాయుడుకు అయితే బాగుండు అని అనిపించుకునేలా చేసుకున్నారు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గాన్ని కనిపెట్టుకుని ఉండి ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నారు. వీలైనన్ని సమస్యలు పరిష్కరించారు. అధికారంతోనే పరిష్కరించగలిగే సమస్యలకు హామీలు ఇచ్చారు. ఇప్పుడు వాటిని నెరవేరుస్తున్నారు.
ప్రజాభిమానాన్ని పొందిన లోకేష్
లోకేష్ అంటే ఎన్టీఆర్ మనవడు, చంద్రబాబు కుమారుడు.. ఆయన ఆకాశం నుంచి ఊడిపడ్డాడని ఎక్కువ మంది అనుకుంటారు. ఆయన అందుబాటులో ఉండరని .. సామాన్యుల కష్టాలు తెలియవని అనుకుంటారు. అందుకే మొదటి సారి ఓడిపోయారు. కానీ ఆయన ప్రజల మనిషి అని అర్థం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. గెలిచిన తర్వాత కూడా ఆయన మారలేదు. మంత్రిగా ఉన్నా.. పార్టీ బాధ్యతలు చేపడుతున్నా.. మంగళగిరి ప్రజలకు ఇచ్చిన హామీల జాబితాను పక్కన పెట్టుకుని ఎప్పటికప్పుడు పరిష్కారం దిశగా పనులు చేపడుతున్నారు.
ఓ నిమ్మల.. మరో లోకేష్
ఏపీలో ఇప్పుడు రాజకీయం ఎంత సులువో.. ప్రజాభిమానం పొందడం ఎంత ఈజీనో నిరూపిస్తున్నవారిలో ఇద్దరు టాప్ పొజిషన్ లో ఉంటారు. ఒకరు నిమ్మల రామానాయుడు.. మరొకరు లోకేష్. ఇద్దరి స్టైల్ భిన్నం. కానీ ప్రజాభిమానం మాత్రం సేమ్ టు సేమ్. ఇతర ఎమ్మెల్యేలు కూడా వీరిని చూసి..ఫాలో అయిపోతే వారికి తిరుగు ఉండదు. అలాగే చేయాల్సిన అవసరం లేదు.. తమ దైన శైలిలో ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తే సరిపోతుంది. మరి నేర్చుకుంటారా ?