పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన అనవసర వివాదాలకు దారి తీస్తోంది. ఆయన పర్యటనలో టీడీపీ ఇంచార్జ్ వర్మను పట్టించుకోవడం లేదు. కనీసం అభివృద్ధి కార్యక్రమాలకు పిలవడం లేదు. పైగా జనసైనికులకు గతంలో తమకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు కానీ సమస్యలు పరిష్కరించలేదని చెప్పిస్తున్నారు. దీంతో కొన్ని చోట్ల వర్మ అనుచరులు గందరగోళం సృష్టిస్తున్నారు. జై వర్మ.. జై టీడీపీ నినాదాలు చేస్తున్నారు.
పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు క్షేత్ర స్థాయిలో వర్మను దూరం చేసుకోవాల్సిన అవసరం జనసేనకు లేదు. అయినా నాగబాబు జనసేన ఆవిర్భావ వేదిక మీద వర్మను పరోక్షంగా టార్గెట్ చేశారు. వర్మ బహిరంగంగా పవన్ ను ఎప్పుడూ విమర్శించలేదు. జనసేన పార్టీని కూడా టార్గెట్ చేయలేదు. అయినప్పటికీ వర్మను జనసేన ఉద్దేశపూర్వకంగా దూరం చేసుకుంటోంది.
ఎలా చూసినా వర్మకు స్థానిక బలం ఉంటుంది. భవిష్యత్ లో పవన్ కల్యాణ్ కు ఆయన ఎప్పుడూ అండగా ఉండటం వల్ల జనసేనకు ప్రయోజనమే ఉంటుంది. పవన్ ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పోటీ చేసినంత కాలం ఆయన పోటీకి వచ్చే అవకాశం లేదు. ప్రత్యామ్నాయ పదవులతో సరి పెట్టుకుంటారు. లేదా నియోజకవర్గాన్ని మార్చుకోవడం.. పునర్విభజన జరిగిన తర్వాత వేరే నియోజకవర్గం చూసుకోవడం చేస్తారు. నాగబాబు ఆధ్వర్యంలో వర్మను ఇప్పటికిప్పుడు టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమిటో రాజకీయవర్గాలకూ అంతు చిక్కడం లేదు.