మాస్ హీరోలు, స్టార్ హీరోలకే రిలీజ్‌కు ముందు బిజినెస్ అవ్వడం లేదు. ఓటీటీలు, థియేట్రికల్ రైట్స్ అమ్ముకోవడానికి నానా పాట్లు పడాల్సివస్తోంది. కానీ సంపత్‌నంది మాత్రం తన ‘ఓదెల 2’ సినిమాని ఒక్క టీజర్ చూపించి హాట్ కేక్‌లా అమ్మేశాడు. తమన్నా ప్రధాన పాత్ర పోషించిన సినిమా `ఓదెల 2`. సంపత్‌నంది షో రన్నర్. ఈనెల 17న విడుదల అవుతోంది. బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయ్యింది. ఓటీటీ, నాన్ థియేటర్, థియేటర్ రైట్స్ రూపంలో రూ.28 కోట్లు ఇప్పటికే వచ్చేశాయ్. థియేట్రికల్ రైట్స్ ని సన్ పిక్చర్స్ కు రూ.10 కోట్లకు అమ్మేశారు. ఇది వరకే ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యింది. బడ్జెట్ రూ.25 కోట్ల లోపే. అంటే… ఇప్పటికి టేబుల్ ప్రాఫిట్ సినిమా ఇది.
అయితే.. తెలుగు శాటిలైట్, హిందీ, తమిళ థియేట్రికల్ రైట్స్ ఇంకా చేతుల్లోనే ఉన్నాయి. ఆ రూపంలో వచ్చిన ప్రతీ రూపాయీ నిర్మాతకు లాభమే. ఇటీవల తమన్నా సోలోగా కొన్ని సినిమాలు చేసింది. దేనికీ జరగనంత బిజినెస్ ఈ సినిమాకు జరిగింది. ఇటీవలే ఓ టీజర్ వదిలారు. రేపు (మంగళవారం) ట్రైలర్ విడుదల చేస్తున్నారు. ఆ తరవాత ప్రమోషన్స్ జోరు పెంచబోతున్నారు. సినిమా కూడా పూర్తి స్థాయిలో రెడీ. 2గంటల 23 నిమిషాల రన్ టైమ్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా మారబోతోందని టీమ్ చెబుతోంది. వీఎఫ్ఎక్స్కి పెద్ద పీట వేసిన సినిమా ఇది. ఆ మాయాజాలం ఆకట్టుకొంటుందని సంపత్‌నంది నమ్మకంగా ఉన్నారు. భక్తి, భయం.. ఈ రెండింటినీ రంగరించిన సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర మినిమం గ్యారెంటీ ఉంటుంది. మరి ‘ఓదెల 2’ ఎలాంటి ఫలితాన్ని అందుకొంటుందో చూడాలి.