అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని పెట్టాలన్న డిమాండ్ తో బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ధర్నా చౌక్‌లో ఈ నిరాహారదీక్ష జరుగుతుంది. ఇటీవలి కాలంలో కవిత బీసీ నినాదంతో ఉద్యమాలు చేస్తున్నారు. బీసీ రిజర్వషన్ల కోసం రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడా తీర్మానం కూడా చేయడంతో ఇప్పుడు విగ్రహ సాధన కోసం ఉద్యమాన్ని ప్రారంభించారు.
అయితే తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది. ఏనాడూ ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలన్న ఆలోచన చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే మహాత్మా పూలే విగ్రహాన్ని పెట్టకపోతే ఊరుకునేది లేదని ఉద్యమం ప్రారంభించడం కాస్త అతిగా అనిపిస్తోందని బీఆర్ఎస్ వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి. అయితే కవిత ఈ దీక్షను బీఆర్ఎస్ తరపున కాకుండా.. జాగృతి తరపున నిర్వహిస్తున్నామని అంటున్నారు.
ఈ ధర్నా కూడా ఇందిరా పార్క్ లో నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ధర్నా చౌక్ ను ఎత్తేశారు. కానీ తర్వాత ఏర్పాటు చేయక తప్పలేదు. అక్కడే బీఆర్ఎస్ కూడా ధర్నా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కవిత కూడా అక్కడే ధర్నాలు చేస్తున్నారు.