అమరావతిలో గ్లోబల్ మెడ్ సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకలతో అత్యాధునిక సౌకర్యాలతో ఆసుపత్రి నిర్మిస్తామన్నారు. సోమవారం వైద్య , ఆరోగ్య రంగాలపై చంద్రబాబు మీడియా ఎదుట పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారు.
కుప్పంలో హెల్త్ సర్వ్ సెంటర్ ఏర్పాటు చేశామన్న చంద్రబాబు… రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గుండె సంబంధిత వ్యాధులు , హైపర్ టెన్షన్ , శ్వాసకోస వ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. హైపర్ టెన్షన్ వ్యాధి పురుషుల్లో కంటే ఎక్కువగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోందన్నారు. మోతాదుకు మించి ఉప్పు , చక్కర, నూనె తీసుకోవడం వల్లే అనేక వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని.. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు డైట్ ను కొనసాగించాలని చెప్పారు.
వ్యాధులు దరి చేరకుండా కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామం విధిగా చేయాలని పిలుపునిచ్చారు. అరగంటపాటు వ్యాయామం చేయాలన్నారు. ఇప్పుడు ప్రపంచమంతా ప్రాణాయామం చేస్తోందని.. ఏపీ ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకుగాను ప్రాణాయామం చేయాలని పిలుపునిస్తున్నట్లు చెప్పారు.