వైసీపీ ప్రజల్లోకి రావడం లేదు. కానీ ప్రజల్లోకి వస్తూ.. ప్రతి అంశంపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న షర్మిలను మాత్రం వైసీపీ టార్గెట్ చేస్తోంది. తాజాగా సాక్షిలో చంద్రబాబు సేవలో షర్మిల అంటూ గతంలో ఆమె తన కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు వెళ్లిన సమయంలో తీసిన ఫోటోలను ఉపయోగిస్తూ పెద్ద కథనం రాశారు. ఈ కథనంపై షర్మిల విరుచుకుపడ్డారు. జగన్ పరువు తీసేలా వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ అద్దంలో ముఖం చూసుకుంటే చంద్రబాబే కనిపిస్తున్నారని షర్మిల జగన్ ను ఎద్దేవా చేశారు.
రాజకీయం మర్చిపోయిన వైసీపీ
వైసీపీ నాయకులు ఇప్పుడు పూర్తిగా విశ్రాంతిలో ఉన్నారు. వారెవరూ ప్రభుత్వంపై పోరాటానికి ఆసక్తి చూపించడం లేదు. స్వయంగా జగన్ రెండు రోజుల పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే అదో పెద్ద అఛీవ్ మెంట్ అన్నట్లుగా ఉన్నారు. ఇక ఇతర నేతల సంగతి చెప్పాల్సిన పని లేదు. తమ అవినీతి వ్యవహారాల్లో ఏదైనా విచారణ జరిగితే అప్పుడు మాత్రం తెర ముందుకు వచ్చి టీడీపీపై పేర్ని నాని వంటి వారితో రివర్స్ విమర్శలు చేయిస్తున్నారు. కానీ షర్మిల మాత్రం పూర్తి స్థాయిలో ప్రతిపక్ష నేత పాత్ర పోషించేందుకు ప్రయత్నిస్తున్నారు.
వైసీపీ కంటే యాక్టివ్ గా షర్మిల
షర్మిల ప్రజల తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేస్తున్నారు. అన్ని అంశాలపైనా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. పోలవరం నుంచి స్టీల్ ప్లాంట్ వరకూ దేన్నీ వదిలి పెట్టడం లేదు. ఇది వైసీపీకి నచ్చడం లేదు. తమ కంటే ముందు వెళ్తున్నారన్న ఉద్దేశంతో రివర్స్ ప్రచారం చేస్తున్నారు.
వివేకా హత్యపై మాట్లాడుతున్నందుకే ఆగ్రహం ?
వివేకా హత్యపై షర్మిల మాట్లాడుతున్నప్పుడు మాత్రమే ఇలాంటి రియాక్షన్ వస్తూండటంతో.. వైసీపీ అధినాయకత్వం ఆమెపై ఇలాంటి కథనాలను రాయిస్తోందని భావిస్తున్నారు. గతంలో షర్మిల పలు అంశాలపై మాట్లాడినప్పుడు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.. కానీ ఇటీవల అవినాష్ రెడ్డి సాక్షుల్ని బెదిరిస్తున్నారని చెప్పగానే మరోసారి చంద్రబాబు సేవలో అంటూ.. ప్రచారం ప్రారంభించారు. అయితే షర్మిల ఇటీవలే డోంట్ కేర్ అన్నారు.. ఇక జగన్ ను ఏ మాత్రం గౌరవించే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు.