నిర్లక్ష్యంగా ఉంటే దొంగలు దేన్నైనా ఎత్తుకెళ్తారు. దానికి సాక్ష్యమే కియా పరిశ్రమలో జరిగిన ఇంజిన్ దొంగతనాలు. దాదాపుగా 900 కార్ల ఇంజన్లు కియా పరిశ్రమలో కనిపించకుండా పోయాయి. సీక్రెట్స్ గా దర్యాప్తు చేయాలని కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు చేయకుండా పోలీసుల్ని కోరింది. కానీ ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పడంతో చివరికి ఫిర్యాదు చేశారు. విషయం వెలుగు చూసింది.
కియా కార్ల పరిశ్రమకు ఇంజిన్లు తమిళనాడు నుంచి వస్తాయి. కంటెయినర్లలో వాటిని తీసుకు వస్తారు. ఈ మధ్య కాలంలో లెక్కలు చూస్తే 900 ఇంజిన్లు కనిపించడం లేదు. ఎన్ని సార్లు లెక్కలు చూసినా తేడా ఉండటంతో ఎక్కడో మిస్సయ్యాయని అర్థమయింది. ఉద్యోగులను ప్రశ్నించారు. అయితే కొంత మంది ఉద్యోగులు మానేసి వెళ్లిపోయారు. వారు ఈ పని చేసిన ఉంటారని అనుమానిస్తున్నారు.
ఇంజన్లను తీసుకెళ్లాలంటే ప్యాక్టరీలోకి వచ్చిన తర్వాత తీసుకెళ్లడం సాధ్యం కాదని.. ఫ్యాక్టరీకి రాక ముందే మాయం చేసి ఉంటారని భావిస్తున్నారు. పైగా ఇది ఒకరిద్దరు చేసే పని కాదు.. సిండికేట్ గా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ దొంగలు ఖచ్చితంగా కియా ఇంటి దొంగలేనని భావిస్తున్నారు. పోలీసులు ఈ కేసు ఎప్పటికి చేధిస్తారో.. ఎవరు ఆ ఇంజిన్లను కొట్టేశారో.. వాటిని ఏం చేశారో అప్పటికి క్లారిటీ వస్తుంది.