హైదరాబాద్ నగరంలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్లు, ఫ్లాట్లు లభించే ఏరియాల్లో ఒకటి బోడుప్పల్. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో ఇటీవల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంగా ఉండటమే కాదు.. గచ్చిబౌలి, హైటెక్ సిటీలకు కనెక్టివిటీ మెరుగ్గా ఉంటుంది. కాస్త దూరమైనా ఐటీ కారిడార్ కు మెరుగైన కనెక్టివిటీ ఉండటంతో ఐటీ ఉద్యోగులు కూడా ఇటు వైపు ఆసక్తి చూపిస్తున్నారు.
బోడుప్పల్ ఐటీ ప్రొఫెషనల్స్, మధ్యతరగతి కుటుంబాలకు ఆకర్షణీయమైన ప్రాంతంగా మారింది. ఇక్కడ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్ల డిమాండ్ ఎక్కువగా ఉంది. రోడ్లు, స్కూళ్లు, హాస్పిటల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయి . ఉప్పల్, నాగోల్, ఎల్.బీ. నగర్‌లకు సమీపంలో ఉండటం, అలాగే హైదరాబాద్-వరంగల్ హైవేకి దగ్గరగా ఉండటం వల్ల ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు అనుకూలంగా ఉంది.
ఇతర ప్రాంతాలతో పోలిస్తే బోడుప్పల్ ధరలు అందుబాటులో ఉన్నాయి. అపార్టుమెంట్లలో సౌకర్యాలను బట్టి చదరపు అడుగుకు రూ. 4,500 నుంచి రూ. 6,000 వరకు అమ్ముతున్నారు. రూ. 45 లక్షల నుంచి రూ. 60 లక్షల మధ్య డబుల్ బెడ్ రూం అపార్టుమెంట్లు లభిస్తున్నాయి. స్విమ్మింగ్ పూల్, జిమ్, క్లబ్‌హౌస్ వంటి అదనపు సౌకర్యాలతో ఉంటే కాస్త ఎక్కువ ధర పడుతోంది. బోడుప్పల్లో వెంచర్లు, కాలనీల్లో కూడా ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందుబాటులో ఉంటున్నాయి. ప్రాంతాన్ని బట్టి 35 వేల వరకూ గజం స్థలం పలుకుతోంది. కాస్త పెద్ద స్థలంలో అటే 200 గజాల స్థలంలో కట్టే ఇండిపెడెంట్ హౌస్ ను కోటికి స్థానిక బిల్డర్లు అమ్ముతున్నారు.
వచ్చే రెండు, మూడేళ్లలో మరింత ఎక్కువ అభివృద్ధి బోడుప్పల్ వైపు జరిగే అవకాశం ఉంది. అందుకే పెట్టుబడికి తగ్గట్లుగా రిటర్న్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు.