ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటుంటారు..బీఆర్ఎస్ పార్టీలో కవిత మాత్రం అందుకు విరుద్ధమైన పాలిటిక్స్ చేస్తున్నారు. రచ్చ గెలిచేందుకు రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నా… ఇంట( పార్టీ)లో గెలిచేందుకు ఆమెకు సరైన సహకారం దక్కడం లేదు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా ఫూలే విగ్రహాన్ని ప్రతిష్టించాలని కవిత చేపట్టిన దీక్షకు బీఆర్ఎస్ ముఖ్య నేతల నుంచి పెద్దగా మద్దతు రాకపోవడమే ఇందుకు కారణం. దీంతో కవిత రాజకీయం నవ్వులపాలౌతుంది.
మంగళవారం ఇందిరా పార్క్ చేపట్టిన దీక్షలో జాగృతి నాయకులు, తన వర్గంగా ముద్రపడిన నేతలు మాత్రమే హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి ముఖ్య నేతలు ఎవరూ ఈ దీక్షలో పాల్గొనలేదు. గతంలోనే ఫూలే విగ్రహ ఏర్పాటు విషయంలో కవిత ట్రోలింగ్ కు గురైంది. ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎందుకు ఆపని చేయలేదనే పదునైన ప్రశ్నలు ఎదురుదాడి చేశాయి. లిక్కర్ స్కామ్ లో జైలు జీవితం గడిపిన కవిత.. ఈ మచ్చను తొలగించుకునేందుకు మహనీయుల విగ్రహ ఏర్పాటు పేరిట రాజకీయం చేస్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది.
అందుకే కవిత బీసీ , సామాజిక ఉద్యమకారుల నుంచి మద్దతు లభించడం లేదు. పైగా.. బీఆర్ఎస్ అధినేత కూడా ఈ విషయంలో కవితను మందలించారనే టాక్ అప్పట్లో నడిచింది. ఇప్పుడు మళ్లీ అదే అంశంతో రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో కేసీఆర్ సన్నిహిత నేతలు, బీఆర్ఎస్ ముఖ్యులు ఎవరూ కవిత దీక్షలో పాల్గొనెందుకు ఆసక్తి చూపడం లేదని గులాబీ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.