వాలంటీర్లను కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం అనుకున్నా సరే కొనసాగించలేకపోతోంది. వారికి పదివేలు జీతం ఇస్తామని చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేద్దామంటే అసలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఒక్క వాలంటీర్ కూడా లేరు. దీంతో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోతోంది. ఇలా ఎందుకు జరుగుతోందంటే.. జగన్ చేసిన నిర్వాకం వల్లనే. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ తన మన్యం పర్యటనలో వివరించారు.
వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పామని.. అయితే వాలంటీర్లకు సంబంధించి ఏ పేపర్ వర్క్ ప్రభుత్వం దగ్గర లేదని పవన్ చెప్పారు. . వాలంటీర్లు ప్రభుత్వానికి సంబంధం లేకుండా పని చేశారు.. అసలు వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్లు అధికారికంగా దాఖలాలే లేవని పవన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి వాలంటీర్లను మభ్యపెట్టారన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.
నిజానికి వాలంటీర్ల వ్యవస్థ ఎన్నికలకు ముందే ముగిసిపోయింది. దాన్ని కొనసాగించేందుకు జగన్ ఆమోదం చెప్పలేదు. ఎన్నికల సమయంలో పార్టీ కోసం వాడుకోవాలన్న దుర్భుద్దితో వారి జీవితాలతో ఆడుకున్నారు. చివరికి ఈసీ అడ్డం పడటంతో వారిలో సగం మందితో రాజీనామా చేయించారు. మిగతా సగం మందికి కొనసాగింపు ఇవ్వలేదు. దీంతో అందరూ మాజీ వాలంటీర్లు అయ్యారు.
నిజానికి వాలంటీర్లు అంతా వైసీపీకి చెందిన వారే. వారి కార్యకర్తల్నే తీసుకున్నారు. వారితో ఐదేళ్ల పాటు పార్టీకి సంబంధించిన పనుల్ని చేయించుకున్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించారు. చివరికి వారిని రోడ్డున పడేసి వెళ్లారు.