రాజకీయాలను రాజకీయాల్లాగే చేయాలి. రాజకీయ పార్టీలతో పోటీ పడాలి. రాజకీయ నేతల్నే ప్రత్యర్థులుగా ఎంచుకోవాలి. కానీ వ్యవస్థలను వాడుకోవడం.. వాటిపై దాడి చేయడం అనేది ప్రజాస్వామ్య రాజకీయ నేత లక్షణం కాదు. జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి లక్షణం ఒక్కటీ లేదు. అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను వాడుకుని ప్రతిపక్ష నేతలపై భౌతిక దాడులు, తప్పుడు కేసులు పెట్టడానికి ఉపయోగించుకున్న ఆయన ఇప్పుడు విపక్షంలోకి వెళ్లే సరికి ఆ వ్యవస్థ బట్టలూడదీస్తానని హెచ్చరిస్తున్నారు. ఆయన తీరు రాజకీయవర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
పోలీసుల బట్టలూడదీస్తానని జగన్ రాప్తాడులో మొదటి సారి అనడం లేదు. గతంలో విజయవాడలోనూ అదే అన్నారు. రాప్తాడులోనూ అదే అంటున్నారు. అక్కడ ఉన్న ఎస్ఐ మీద ఆరోపణలు చేస్తూ.. మొత్తం వ్యవస్థను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి తగ్గట్లుగా పని చేస్తారు. ప్రభుత్వ పెద్దలు ఎంత నీతి పాటిస్తారో వారు అంతే పాటిస్తారు. జగన్ రెడ్డి ఎంత నీతి పాటించారో పోలీసులు కూడా అంతే పాటించి.. తమ స్వామి భక్తి చాటుకుని ఇప్పుడు పోలీస్ డ్రెస్ వేసుకునే అవకాశం లేకుండా.. పక్కన కూర్చుని ఉన్నారు.
చంద్రబాబు పోలీసు వ్యవస్థ గౌరవాన్ని కాపాడాలని అనుకుంటున్నారు కాబట్టే తనను.. తన కుటుంబాన్ని.. పార్టీ నేతల్ని ఘోరంగా వేధించిన పోలీసు అధికారుల్ని జైలుకు పంపే అవకాశం వచ్చినా…వదిలి పెట్టేశారు.లేకపోతే సీతారామాంజనేయులు దగ్గర నుంచి కనీసం పది మంది ఐపీఎస్లు జైలుకెళ్లడానికి అవసరమైన సరుకంతా ప్రభుత్వం ఉంది. ఇక జగన్ నేర పూరిత ఆలోచనల్లో పాలు పంచుకున్న కిందిస్థాయి పోలీసుల గురించి చెప్పాల్సిన పని లేదు. అయినా వారెవరూ జైలుకు వెళ్లడం లేదు. చంద్రబాబు ఇలా పోలీసుల ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తూంటే.. జగన్ మాత్రం వారి ఆత్మస్థైర్యంపై గొడ్డలి పోటు వేసేందుకు అవకాశం వచ్చినప్పుడల్లా దాడి చేస్తున్నాడు.