సనాతన ధర్మం గురించి, మన శాస్త్రాల గొప్పదనం గురించి, ఆచారాల గురించి చెప్పే కథలకు ఇప్పుడు మంచి గిరాకీ ఉంది. కాంతార, కార్తికేయ 2, అఖండ… ఇవన్నీ ఈ తరహా కథలే. ఇప్పుడు ‘ఓదెల 2’ కూడా ఈ జాబితాలో చేరడానికి సిద్ధంగా ఉంది. తమన్నా ప్రధాన పాత్ర పోషించిన సినిమా ఇది. సంపత్ నంది ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ. దర్శకుడు ఆయన కాకపోయినా ఇది సంపత్ నంది సినిమాగానే చలామణీ అవుతోంది.
దేవుడు – దెయ్యం మధ్య జరిగే పోరాటమే ఈ కథ. అయితే.. ఈ కథని చెప్పడానికి ఎంచుకొన్న నేపథ్యం, తీర్చిదిద్దిన విధానం, చూపిస్తున్న విజువల్స్ `ఓదెల 2`ని ప్రత్యేకంగా నిలిపాయి. ఇటీవల వచ్చిన టీజర్‌తో ‘ఓదెల 2’కి మార్కెట్ ఓపెన్ అయ్యింది. సినిమా విడుదలకు ముందే బిజినెస్ క్లోజ్ అవ్వడానికీ, నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్ దక్కడానికి ఆ టీజర్ చాలా ఉపయోగపడింది. ఇప్పుడు ట్రైలర్ వదిలారు.
ట్రైలర్ చూస్తుంటే.. ‘అరుంధతి’ నాటి రోజులు గుర్తొస్తున్నాయి. అలాంటి కథని, ఈ జనరేషన్‌కు తగ్గట్టు, ఇప్పటి సాంకేతికతని వాడుకొని తీర్చిదిద్దితే ఎలా ఉంటుందో ఈ ట్రైలర్ అలా వుంది. ఓ దుష్టశక్తినీ, శివ భక్తురాలికీ మధ్య జరిగే పోరాటం ఈ కథ. అడుగడుగునా విజువల్స్ ఆకట్టుకొన్నాయి. అబ్బుర పరిచే షాట్స్ ఈ ట్రైలర్ లో చాలానే కనిపించాయి. తల కిందులుగా తపస్సు చేయడం, మండే అగ్నిగోళం మానవరూపంతో మాట్లాడడం, సైకిల్ ట్రాక్టర్… గిర గిర తిరగడం.. ఒకటేమిటి? గుడ్లప్పగించి చూసే షాట్స్ ఈ ట్రైలర్లో చాలా కనిపించాయి. తమన్నాకు ఇది పూర్తిగా కొత్త తరహా పాత్ర. ఆమె ఆహార్యం వైవిధ్యంగా ఉంది. చివరి షాట్.. క్లైమాక్స్ లో తమన్నా చూపించే విశ్వ రూపానికి మచ్చుతునకలా అనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. అజనీష్ లోక్ నాథ్ అందించిన నేపథ్య సంగీతం మరింత బలాన్ని ఇచ్చింది. గోమాత గురించి చెప్పిన డైలాగ్.. బాగా వైరల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మాయలు, మంత్రాల జోనర్ సినిమాలు ఇష్టపడేవాళ్లకు ‘ఓదెల 2’ మంచి ఆప్షన్. ఈనెల 17న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.